చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ..!
- స్వార్థ రాజకీయాలకు శ్రీవారిని వాడుకోవడం దురదృష్టకరం
- రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలనుకోవడం బాధాకరం
- పాలనలో వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్
- స్వామివారి ఆగ్రహం ప్రజలపై పడకూడదనే ప్రత్యేక పూజలు
- వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
- వైసీపీ శ్రేణులతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రజాభూమి, అనంతపురము
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. శ్రీవారి లడ్డూ విశిష్టతకు, తిరుమల పవిత్రతకు కూటమి నేతలు భంగం కలిగించారని, చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడంతో పాటు స్వామివారి ఆగ్రహం రాష్ట్ర ప్రజలపై పడకూడని ప్రార్థించామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం ఉదయం నగరంలోని రైల్వే ఫీడర్ (ఆర్‌ఎఫ్) రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూజల అనంతరం దేవాలయం బయట వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. చివరకు కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని కూడా వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రపంచమంతా వెంకటేశ్వరస్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, ఎంతో విశిష్టత ఉన్న తిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. లడ్డూను స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకున్నారని ప్రజలకు తెలిసిపోయిందని, అందుకే తిరుమల పర్యటనకు జగన్ వెళ్తుంటే అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఇతర రాష్ట్రాలను నుంచి తీసుకొచ్చి మత కలహాలు సృష్టించాలనుకున్నారని ఆరోపించారు. ఇది ఎంతో బాధాకరం, అత్యంత హేయనీయమని అన్నారు. ఇందులో జనసేన, బీజేపీ భాగస్వాములు కావడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు ఘోర అపచారం చేసిన నేపథ్యంలో స్వామివారి ఆగ్రహం ప్రజలపై పడకుండా ఉండాలనే ఆలయాల్లో పూజలు చేసినట్లు తెలిపారు. పాపాత్ములను శిక్షించాలని వేడుకున్నామన్నారు. డిక్లరేషన్ పేరుతో కుట్రలు చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం కాకముందు, సీఎం అయ్యాక కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండబట్టే తండ్రీకొడుకులైన వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలకు బ్రహ్మోత్సవాల వేళ పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలిగిందని అన్నారు. రాష్ట్రంలో 100 రోజుల పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయారని విమర్శించారు. పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తిరుమల శ్రీవారిని చంద్రబాబు వాడుకున్నారన్నారు.