ముంబయి:మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే, ముంబయి యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జీషాన్ సిద్ధిఖీకి ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించినప్పుడు నాందేడ్ వద్ద రాహుల్ గాంధీని కలవాలనుకున్నానని జీషాన్ సిద్ధిఖీ వెల్లడించారు. అయితే, రాహుల్ సన్నిహితులు చెప్పిన మాటతో తనకు మతిపోయినంత పనైందని అన్నారు. రాహుల్ ను కలవాలంటే నువ్వు 10 కేజీల బరువు తగ్గాలని వారు నాతో చెప్పారు అని జీషాన్ సిద్ధిఖీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో మైనారిటీల పట్ల వివక్షకు ఇదే నిదర్శనమని అన్నారు. కాగా, జీషాన్ సిద్ధిఖీ తండ్రి, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఫిబ్రవరి 12న ఎన్సీపీలో చేరారు. ఈ పరిణామం నేపథ్యంలో బాబా సిద్ధిఖీ తనయుడు జీషాన్ ను ముంబయి యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ తప్పించింది. ఈ క్రమంలో జీషాన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.