ఏలూరు:57 కుటుంబాలను అకారణంగా గ్రామం నుండి బహిష్కరించినట్లు ప్రకటించడం దుర్మార్గమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గం. భీమడోలు మండలం, ఆగడాల లంక గ్రామంలో వెలివేయబడ్డ ప్రజల తో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏలూరు నగరంలోని స్థానిక లేడీస్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తే బాబి మాట్లాడుతూ కొందరు వారి స్వార్ధపూరితమైన ఆలోచనలతో ఆగడాల లంక గ్రామ ప్రజలలో 57 కుటుంబాలను అకారణంగా గ్రామం నుండి బహిష్కరించడం సమంజసం కాదన్నారు. వారు తాతల కాలం నుండి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనరన్నారు. ఆధార్ కార్డు, ఓటరు కార్డు, రేషన్ కార్డు లు సైతం ఆగడాలలంక గ్రామంలోనే పొందారన్నారు. వారు స్థానిక పెత్తందారు లైనా పాము వెంకటేశ్వరరావు, కనమాల ఆదాము, చిగురుపాటి యెహోషువ, మద్దా పాపారావు, మద్దా చిన్నబ్బాయి అను వారు గ్రామంలో చేస్తున్న అరాచకాలను అడ్డు తగులుతున్నారని, గ్రామం నుండి వెలి వేసినట్లు ప్రకటనా చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. గ్రామ పెద్దలు ఉచ్చుల జోసఫ్, చిగురుపాటి శుభాకరరావు, వట్లూరు సుందరరావు, మద్దా జాన్ బాబు కు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఇదెక్కడి న్యాయం అని మేము ప్రశ్నించగా, ఇక్కడ కొల్లేరు రాజ్యాంగం నడుస్తోందనటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ సమావేశంలో నల్లమిల్లి మరియమ్మ, గోరింకల బేబమ్మ, ముద్ద మార్గరెట్, కంచర్ల రమణమ్మ, పళ్లెం నాగేశ్వరరావు, మరిపూడి సుందర్రావు, షేక్ బాజీ, శంకరపల్లి సంతోష్, అద్దంకి పండు, విగ్నేష్, దుర్గారావు, రమణ తదితరులు పాల్గొన్నారు.