ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి ఇకపై తాను వ్యక్తిగతంగా మాట్లాడబోనని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దీనిపై మరింత వివరణ ఇస్తూ.. ‘జగన్ మాటల్లోనే చెప్పాలంటే మంచో చెడో చేయాల్సింది చేశాడు వెళ్లిపోయాడు.. ఇప్పుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరు. ప్రజల దృష్టి ఇప్పుడు మాపై ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందా.. ఎలా నెరవేర్చుతుందనేదే చూస్తారు. అందుకే మేం కూడా మా హామీలను అమలు చేసే విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తాం’ అని రఘురామ చెప్పారు.ఇకపై జగన్ పై కానీ, వైసీపీ పైన కానీ ప్రజల దృష్టి ఉండదు, ఉండకూడదు కూడా అని వివరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి తమ పార్టీ నేత చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు, బాధ్యతను కట్టబెట్టారని చెప్పారు. అందుకే మనం దాడులు అవీ చేయొద్దని అందరికీ స్ఫష్టం చేశారన్నారు. తప్పు చేసిన వాళ్లను చట్టప్రకారం శిక్షించాలని చెప్పారన్నారు. అందుకే తనపై జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామ వివరించారు.ఎందుకంటే, ఆసుపత్రి నివేదిక ప్రకారం తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. అలాంటిది నాకు నేనే న్యాయం చేసుకోకుంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోతుందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకునే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఒకటి రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుందని వివరించారు. అంతేకానీ ఈ విషయంపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి సూచనల మేరకో తాను ఫిర్యాదు చేయలేదని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు.