టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) మొబైల్ పోర్టబులిటీకి సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం వల్ల మొబైల్ పోర్టబులిటీ ప్రక్రియ ఇకపై వారం రోజుల్లో పూర్తికాదు. స్విమ్ స్వాప్ మోసాలను అరికట్టే చర్యల్లో భాగంగా, ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. మొబైల్ పోర్టబులిటీ అంటే… ప్రస్తుతం వినియోగిస్తున్న టెలికాం కంపెనీ నంబరును మరో టెలికాం నెట్‌వర్క్‌కు మార్చుకునే విధానం. ఈ విధానం తర్వాత ఆపరేటింగ్ నెట్‌వర్క్ మాత్రమే మారుతుంది. మొబైల్ నంబరులో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, ఇటీవలి కావంలో స్విమ్ స్వాప్ మోసాలు పెరిగిపోయాయి. వీటికి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ట్రాయ్ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సవరించిన నిబంధన మేరకు.. సిమ్ కార్డు దొంగతనానికి గురైనా, దెబ్బతిన్నా సంబంధిత వినియోగదారులు వారం రోజుల లోపల అదే నంబరుతో తిరిగి సిమ్‌ను పొందడం సాధ్యపడుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి అందిన సిఫార్సులను పరిశీలించాలని, వివిధ భాగస్వాములతో చర్చలు అనంతరం కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చామని ట్రాయ్ వెల్లడించింది. ఈ నిబంధన జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. మోసాల కోసం సిమ్ స్వాప్, సిమ్ రీప్లేస్‌మెంట్‌లకు పాల్పడుతున్న వ్యక్తుల, సంస్థలకు అడ్డుకోడమే తమ లక్ష్యమని తెలిపింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియలో యూనిక్ పోర్టింగ్ కోడ్ కీలకమైన దశ అని, తాజా మార్గదర్శకాల ప్రకారం ఏడు రోజుల వ్యవధిలోనే టెలికాం ఆపరేటర్లు యూపీసీ కోడ్‌ను జారీ చేయలేరని ట్రాయ్ వివరించింది.