పట్టిపీడిస్తున్న నిధుల కొరత
బుట్టాయగూడెం:పశ్చిమ ఏజెన్సీ ప్రాంత ప్రజల వైద్య ఆరోగ్య అవసరాలు తీర్చడానికి సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన 146 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు సుమారు రెండు నెలలుగా ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత అని తెలుస్తుంది. కొంతకాలం చురుకుగా సాగిన ఆసుపత్రి నిర్మాణం పనులు చూసి ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాలంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత వరకు ఆలస్యమైనప్పటికీ పనులు నత్త నడకన కొనసాగుతూనే వస్తున్నాయి. కానీ సుమారు గత రెండు నెలలుగా ఆసుపత్రి నిర్మాణం పనులు పూర్తిగా ఆగిపోవడంతో, ఆసుపత్రి నిర్మాణంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎంఎస్ఐడిసి) ఆధ్వర్యంలో 12.5 2 ఎకరాల విస్తీర్ణంలో 10714.34 చదరపు మీటర్ల మేర ఆసుపత్రి భవనాల నిర్మాణం జరగవలసి ఉంది. హైదరాబాద్ కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కాంట్రాక్టర్ కాగా ప్రస్తుత పనులను సబ్ కాంట్రాక్ట్ గా గాయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణం మూడు బ్లాకులుగా జరుగుతుండగా, బ్లాక్ వన్ లో ఒక స్లాబ్ పూర్తయింది. బ్లాక్ టు లో గ్రౌండ్ లెవెల్ పుట్ అప్స్ పూర్తయి, ప్లింత్ బీములు వేయవలసి ఉంది. బ్లాక్ త్రీ లో ప్లింత్ బీములపై పిల్లర్స్ వేసి స్లాబ్ వేయవలసి ఉంది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి 2020 అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
కాగా నిర్మాణ స్థలంలో ఉన్న హోర్డింగుల సమాచారం ప్రకారం నిర్మాణం పనులు 2021 మే 28వ తేదీన ప్రారంభమై, 2024 నవంబర్ 27వ తేదీ నాటికి పూర్తి అగునట్లు చూపిస్తున్నాయి. నిజానికి హోర్డింగ్ లో నిర్మాణం పనులు పూర్తి అవ్వాల్సిన సంవత్సరం 2023 కాగా 23 పై 24 గా దిద్దారు (కానీ నిర్మాణ వ్యవధి పనుల ప్రారంభం నుండి 31నెలలుగా సూచిస్తుంది). ఆసుపత్రి నిర్మాణం పనుల ఆలస్యంపై ఏపీఎంఎస్ఐడిసి ఎస్ ఇ బలరామరెడ్డి, ఈ ఈ రాజబాబు లను వివరణ కోరగా ఆసుపత్రి నిర్మాణం పనులు హెడ్ ఆఫ్ ది ఎకౌంటు సమస్యతో ఒక సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, కొన్ని సాంకేతిక కారణాలతో ప్రస్తుత పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 10 కోట్ల రూపాయలు విలువైన పనులు పూర్తయ్యాయని, నిధులు మంజూరు కాగానే పనులు వేగవంతం చేస్తామని అన్నారు. నిర్మాణ పనులు పూర్తి కావడానికి చెప్పిన సమయం కంటే 30 నెలల కన్స్ట్రక్షన్ డ్యూరేషన్ ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం ఆగిపోయిన ఆసుపత్రి నిర్మాణ పనులపై గాయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కె.రామారావును వివరణ కోరగా ఇప్పటివరకు జరిగిన పనులకు కొంతవరకు బిల్లులు మంజూరు కాలేదని, ఈ కారణంగా ఆసుపత్రి పనులకు ఆటంకం కలిగిందని తెలిపారు. తమకు ఆర్థిక సహకారం అందగానే పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. ఆసుపత్రి మొత్తం నిర్మాణం వ్యయం 49 కోట్ల 26 లక్షల కాగా దీనిలో నాబార్డు రుణం రూ.3872.49గా ఉంది. ప్రభుత్వం వెంటనే ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించి, త్వరితగతిని ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి, ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉన్నత వైద్యం అందించాలని కోరుతున్నారు.