ఎన్‌టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ఘాట్‌లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు ఆర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్‌టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్‌టీఆర్ అని, ఆయన స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారని తెలిపారు. రైతు కుటుంబంలో పుట్టిన ఎన్‌టీఆర్ మొదట చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని, ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారన్నారు. ఆయన అంటే నవరసాలకు అలంకారం అని అన్నారు. నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు అని ప్రశంసించారు. ఎన్‌టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వైద్యులు, న్యాయవాదులు, అభిమానులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు.