బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దరియాపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి దండుగలను చెదరగొట్టారు. దీనిపై ఖల్లార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి 45 మందిని అరెస్టు చేశారు. ఈ దాడి ఘటన తర్వాత నవనీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ, ఖల్లార్లోని ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని మండిపడ్డారు. ప్రచార సభ జరుగుతుండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారని తెలిపారు.