తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాల తయారీపై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను టీటీడీ అధికారులు తోసిపుచ్చారు. వాటిని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. అవన్నీ కూడా నిరాధారమైన వార్తలని స్పష్టం చేశారు. అసత్యాలను ప్రచారం చేస్తోన్నారని పేర్కొన్నారు. శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు నిరాధారమని టీటీడీ అధికారులు తేల్చి చెప్పారు. సేంద్రీయ బియ్యం వాడకాన్ని నిలిపివేసి, గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదే విధంగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోన్న విషయం తమ దృష్టికి వచ్చిందని వివరించారు. టీటీడీ కార్యనిర్వాహణాధికారి జే శ్యామల రావు ఇటీవలే అర్చకులు, ఆలయ అధికారులతో సమావేశం అయ్యారని, స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని తెలిపారు. అంతేతప్ప అందులో మార్పులు చేయడంపై ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని అన్నారు.
కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం పెంచినట్టు పుకార్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.