Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంఓ కల..ఎగసిపడిన అల..!

ఓ కల..ఎగసిపడిన అల..!


సీమంటే ఫ్యాక్షనిజం..
అదే సీమలో
అడుగడుగునా రౌడీయిజం..
అందునా కడప..
గడప గడపలో
కత్తుల కసకస.
బాంబుల ధడధడ..
దినామంతా గుండె దడ..
అలాంటి సీమలో..
కడప కౌగిట్లో..
పులివెందుల పల్లెలో..
రాజారెడ్డి గడపలో..
విరిసిందొక మల్లి..
శ్వేత వస్త్రాల జాబిల్లి..!

అతడు పుడితే
మురిసింది కన్నతల్లి..
అక్షరం దిద్ది సలక్షణుడైతే
మెరిసింది చదువుల తల్లి..
ఇంతింతై వటుడింతై ఎదిగితే..
తనను పునీతం చేస్తే..
తన గడ్డపై పుట్టిన ప్రతిబిడ్డను
అక్కున చేర్చుకుని బ్రతుకుల్లో
వెలుగు నింపితే..
చూసి ఉప్పొంగిపోయింది
తెలుగు తల్లి..!

రాజకీయం పక్కన బెడితే..
విబేధాలు..వివాదాలు
ఆ రాజకీయానికే ముడిపెడితే..

అందరికీ ఆప్తుడు..
తన విజయగాధను
తానే రాసుకున్న చిత్రగుప్తుడు..
ఒక్క యాత్రతో
కీర్తి ప్రపంచవ్యాప్తుడు..
రాజశేఖరుడు..
రెండు కాళ్ళ రథంపై
చుట్టేస్తే ఆంధ్రావని
మారుమ్రోగిపోయింది
భారతావని
ఆప్పుడే జనం ఘోషించి
నువ్వే మా అన్నవని..
బ్రహ్మరథం పట్టింది
హోరెత్తిపోయేలా
మొత్తం అవని..!

పద్దెనిమిదేళ్ల కల
ముఖ్యమంత్రి సింహాసనం
జనమే చేసి పట్టాభిషేకం
వైఎస్ కు చెప్పేసింది ఓయెస్..
ఆయన విద్వత్తు…
అన్నదాతకు అందించింది
ఉచిత విద్యుత్తు..
2004 లో తెలుగు గడ్డపై మొదలైంది రాజన్న మహత్తు..
రోజుకో గమ్మత్తు..!

ఆరోగ్య”శ్రీకారం”..
వైరి పక్షాల కళ్ళల్లో కారం..
నిరుపేద బిడ్డకు
ఉన్నత విద్య
ఎన్నో ఇళ్లలో తొలి సంధ్య
అనుకున్నది చెయ్యడమే..
తిప్పనిది మడమే..
మొత్తం కుడి ఎడమే..
ప్రతిక్షణం అంతర్మథనమే..
ఏకాంతంలో సైతం
తనకు తానుగా చేసుకున్న మేధోమధనమే..!

నువ్వున్నంత కాలం
తెలుగు నేలకు అదే కీర్తి..
ఉమ్మడి రాష్ట్రం అనే దీప్తి..
నీ హఠాన్మరణంతో
సమైక్య అన్న”పూర్ణ”లక్ష్యం
అయిపోయింది అసంపూర్ణం..!


దివంగత ముఖ్యమంత్రి
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి
జయంతి సందర్భంగా..


ఇ.సురేష్ కుమార్
9948546286

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article