అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం జోగి నైజం
సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
మైలవరం:గుణం లేని వాడే కులం గురించి మాట్లాడతాడని, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం జోగి రమేష్ నైజమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు విమర్శించారు. మైలవరంలో రక్తదాన శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా మాజీమంత్రి జోగి రమేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడులు, ప్రతిదాడులు తమ సంస్కృతి కాదన్నారు. అందరూ చట్టప్రకారం నడుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు దిశా నిర్దేశం చేశారన్నారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టుతో కుల రాజకీయాలు చేస్తున్నారన్నారు. జోగి రమేష్ అమెరికాలో ఉన్న తన కుమారుడిని అధికారంలోకి రాగానే ఎందుకు పిలిపించాడన్నారు. ఇద్దరూ తోడుదొంగల్లా కలసి దోచుకోవడానికి పిలిపించావా? అని ప్రశ్నించారు. కావాలని సి.ఐ.డి అటాచ్ మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి సర్వే నెంబరు మార్చి వేరే వాళ్లకు విక్రయించి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు.సాటి గౌడ కులస్తుడికి ఉద్యోగం ఇప్పించడానికి రూ.7లక్షలు తీసుకున్నాడన్నారు. దీనికి మాజీ ఏ.ఎం.సి చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు సాక్ష్యమన్నారు. మైలవరం నియోజకవర్గంలో సబ్ స్టేషన్లలో 5 షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పించి రూ.35లక్షలు వసూలు చేశాడన్నారు. ఇప్పటికే ఒకరికి రూ.7లక్షలను తిరిగి చెల్లించారన్నారు. మరో రూ.28 లక్షలు కూడా కట్టడానికి సిద్దంగా ఉండాలని జోగికి సూచించారు.బీసీ కార్డును వాడుకుంటూ బీసీలనే దోచుకున్న వ్యక్తి జోగి రమేష్ అని ఆరోపించారు. జోగి నైజం మైలవరం నియోజకవర్గంలో గౌడ సోదరులందరికీ తెలుసన్నారు. పెడన, పెనమలూరు నియోజకవర్గంలో ఎవ్వరిని ప్రశ్నించినా అతని నిజస్వరూపం బయటపడుతుందన్నారు. దొంగలముఠాగా ఏర్పడి అతను, అతని కుమారుడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తాయన్నారు.ధర్మంగా పని చేస్తే ఏమీ కాదన్నారు. అధర్మం ఉంటే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు. తాను గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి పాల్పడిన జోగి ఇంటిపై దాడి చేస్తామని తమ పార్టీ నాయకులు అడిగినా వద్దని చెప్పానన్నారు. ఏదైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను తెలుగుదేశం పార్టీ మహాకూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామన్నారు. రేపు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, దశలవారీగా అన్ని హామీలు నెరవేరుస్తామని వెల్లడించారు. ఇప్పటికే పెంచిన పింఛన్ సొమ్ము రూ.7 వేలు మొదటి నెలలోనే ఇచ్చామని అన్నారు. తర్వాత రూ.4 వేలు చొప్పున ఇస్తున్నట్లు వెల్లడించారు.