అమరావతి:-మాచర్ల నియోజకవర్గంలోని మల్లవరంలో బాణావత్ సామునిబాయి అనే మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో తాగు నీళ్లు పట్టుకునేందుకు కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
ఇంట్లో నీళ్లు లేవని ఆమె ప్రాధేయపడినా వినకుండా ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపడం చూస్తే రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన ఉందో అందరూ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి, వైసీపీ వాళ్లే గాలి పీల్చాలి అనే జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉంది అని పవన్ కల్యాణ్ విమర్శించారు. పంచభూతాలకు కూడా పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. “ఈ పాలకుడు మాట్లాడితే నా ఎస్టీలు, నా ఎస్సీలు అంటాడు. కానీ ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించేవాళ్లను వెనుకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ, నా ఎస్సీ అనే అర్హత ఉందా?” అని పవన్ కల్యాణ్ నిలదీశారు.