Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు

గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు

గత ప్రభుత్వంలో రుషికొండ రాజ భవంతి నిర్మాణ నిధులను ఫిల్డర్ బెడ్ల కోసం వాడి ఉంటే ప్రజలకు ఆరోగ్యం దక్కేది
గత పాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి సమయం సరిపోతోంది
గుర్ల అతిసార ఘటన విచారకరం… కలుషిత నీరే కారణం
బహిరంగ మలవిసర్జన నిరోధానికి చైతన్య కార్యక్రమాలు
మృతుల కుటుంబాలకు వ్యక్తిగత నిధులతో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయం
జల్ జీవన్ మిషన్ నిధులతో గ్రామీణ రక్షిత నీటి సరఫరాకు మంచి రోజులు
ఇప్పటికే రూ.580 కోట్ల విడుదల… పనులు చేస్తే మరిన్ని నిధులు
గుర్ల అతిసార పరిస్థితులపై విజయనగరం జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన రాస్గ్త్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘గత ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. పంచాయతీలకు నిధులు ఇవ్వడం కాదు కదా… కనీసం రక్షిత తాగు నీరు కోసం శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్లను కూడా మార్చలేదు. ఫలితంగా గ్రామీణ తాగునీటి సరఫరాలో లోపాలు తలెత్తి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం మీద తప్పులు తోసేయాలని ఈ మాటలు చెప్పడం లేదని, రూ.600 కోట్లు వెచ్చించి రుషికొండ మీద రాజభవనం కట్టుకున్నారు తప్పితే, ఆ డబ్బుతో పేద ప్రజలకు మంచినీరు అందేలా ఫిల్టర్ బెడ్లను మార్చాలన్న ఆలోచన రాకపోయిందే అన్న ఆవేదనే నన్ను ఈ మాటలు మాట్లాడేలా చేస్తోందన్నారు. ఆ మొత్తంతో రక్షిత తాగు నీటికి నిర్వహణ పనులు చేసి ఉంటే ప్రజలకు ఆరోగ్యం దక్కేది అని చెప్పారు. గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదాలను సరిజేయడానికి తమ పాలనా సమయం సరిపోతోందని నిరాశను వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా, గుర్ల గ్రామంలో అతిసార ప్రభావంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ విజయనగరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగాపవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉంది. ప్రజల సమస్యల పట్ల పూర్తిస్థాయి బాధ్యతతో ఉంటుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికే మాకు చాలా సమయం పడుతోంది. నా శాఖల బాధ్యతలు తీసుకున్న తరవాత గత ప్రభుత్వ హయాంలోని లెక్కలు చూస్తుంటే, నిధుల మళ్లింపు చూస్తుంటే గ్రామీణ పరిపాలన మీద ఇంత నిర్లక్ష్యం చేశారా అని బాధేస్తోంది. అధికారులు, సిబ్బందిని దేనిపై ప్రశ్నించినా గత ప్రభుత్వంలో నిధుల లేమి, నిర్లక్ష్యం, నిర్లిప్తతే సమాధానం అవుతోంది. పాలన విషయాల్లో మేం తప్పించుకోవాలని భావించడం లేదు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటాం.జల్ జీవన్ కు నిధులొచ్చాయి గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా దారి మళ్లించింది. రూపాయి కూడా పంచాయతీల ఖాతాల్లో జమ చేయలేదు. పంచాయతీల్లో నిధులు లేక నిర్వహణ లేక పలు పనులు మూలనపడ్డాయి. దీంతో గ్రామాల్లో అన్ని రకాలుగా పాలన కుంటుపడింది. పారిశుద్ధ్య సమస్యలతోపాటు తాగునీటి సమస్యలు పంచాయతీలను చుట్టుముట్టాయి. గత పాలకులు చేసిన పాపాలు ఇప్పుడు బయటపడి శాపాలుగా మారుతున్నాయి. విజయనగరం జిల్లా గుర్ల ఘటన చాలా బాధాకరం. స్వచ్ఛమైన తాగు నీరు పొందటం అనేది పౌరుల ప్రాథమిక హక్కు. అది కలుషితం కావడం బాధాకరం. గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద ఈ నెల 18వ తేదీన రూ.580 కోట్ల నిధులు వచ్చాయి. ఆ నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తే మరిన్ని నిధులు వచ్చేందుకు అవకాశం ఉంది. గ్రామాల్లో తాగునీటి వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికరించేందుకు జలజీవన్ మిషన్ నిధులను వినియోగించుకుంటాం. ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరు అందించేలా తగిన చర్యలు తీసుకుంటాం.చంపానది కాలుష్య నివారణపై దృష్టిగుర్ల అతిసారం ఘటనకు చంపావతి నది కాలుష్యం కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. చంపావతి నది నుంచి 29 గ్రామాలకు నీరు సరఫరా అయ్యే పంపింగ్ స్కీంను పరిశీలించాను. ఇతర గ్రామాల్లో నీటి కాలుష్యం తక్కువే అయినా గుర్లకు సంబంధించి పైపులైన్లలో నీరు ఒత్తిడి వల్ల వెనక్కు వచ్చే సమయంలో కలుషితం అయి ఉండొచ్చని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం చంపావతి నది నీరు పూర్తి స్థాయిలో కలుషితం అయిపోయింది. దాన్ని నివారించాలి. నదిలో, నది ఒడ్డున చెత్తను వేయడం వల్ల అది కుళ్లిపోయి నది నీటిలో కలుస్తోంది. అదే నీటిని మళ్లీ ప్రజలు శుద్ధి చేయకుండానే తాగుతున్నారు. దీనివల్ల అతిసారంతోపాటు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. గ్రామాల్లో తాగునీటి వనరులను భద్రంగా ఉంచుకునే విషయంలో శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నాం. మంచి నీటి చెరువులు, కుంటలు ఇతర మంచినీటి వనరుల పాయింట్లను తీర్చిదిద్ది, అక్కడ ఏ మాత్రం అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకుంటాం. చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తే గ్రామీణుల ఆరోగ్యానికి కూడా రక్షణగా ఉంటుంది. బహిరంగ మలవిసర్జనపై చైతన్య కార్యక్రమాలు గ్రామాల్లో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన జరుగుతోంది.ఇళ్లలోని మరుగు దొడ్లను గ్రామీణులు వాడటం లేదు. దీంతో నదీ ప్రాంతాలు, కాలువలు, వాగులు, వంకలు కలుషితం అవుతున్నాయి. గుర్ల ఘటనకు కూడా చంపావతి నది ఒడ్డున బహిరంగ మలవిసర్జన కూడా కారణం. దీనిపై జిల్లా కలెక్టరు శ్రీ అంబేడ్కర్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ చైతన్యం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించాను. దీనిపై ప్రజల్లో కూడా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. బహిరంగ మల విసర్జన చేస్తే అది మీ అనారోగ్యానికి దారి తీయడంతో పాటు… ఇతరుల ఆరోగ్యాన్ని హరిస్తుందని తెలుసుకోవాలి. బహిరంగ మల విసర్జన నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు, నిధులు వెచ్చిస్తున్నాయి. అవసరం అని చెప్పిన వారికి వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. దీన్ని ప్రజలు ఉపయోగించుకునేలా క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన పెంచాలి. అప్పుడే ప్రజలంతా నిండు ఆరోగ్యంతో ఉంటారు.మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష సాయం గుర్ల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఐఏఎస్ అధికారివిజయానంద్లో విచారణ చేయించాలని ఆదేశించారు. అతిసారానికి గల కారణాలు ఏమిటో పూర్తిస్థాయిలో నివేదిక ప్రకారం ప్రభుత్వం తరఫు నుంచి బాధితులకు తగిన పరిహారం అందిస్తాం. ప్రస్తుతం నా సొంత నిధుల నుంచి బాధిత పది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పన అందిస్తాను. మృతుల పిల్లల విద్యకు తగిన భరోసా ఇస్తాం. మానవతా దృక్పథంతో ఈ నిధులు వారి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయని భావిస్తున్నాను. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న పంచాయతీల్లో ముఖ్యంగా తాగునీటి అవసరాలకు సంబంధించి పనులపై దృష్టి పెడతాం. దీనికి ఒక పక్కా ప్రణాళికతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతాను. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీటి వ్యవస్థకు జీవం పోస్తాం’’ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article