కాకినాడ
ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండగలరని డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఈమేరకు శనివారం కాకినాడ స్థానిక గాంధీనగర్ అశ్విని హాస్పిటల్ వద్ద అలయన్స్ క్లబ్ ఆఫ్ స్వాతి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ కార్యదర్శి అలై మద్దా వికాష్ అధ్యక్షతన ఉచితంగా మధుమేహ పరీక్షలు, హెచ్.బి.ఏ.1.సి పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ క్లబ్స్ ఎక్స్టెన్షన్ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా రీజియన్ చైర్మన్ అలై దుర్గా సుభద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారు ప్రతి మూడు నెలలకు హెచ్.బి.ఏ.1.సి పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని, ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ మధుమేహ వ్యాధి రావడం సర్వసాధారణం అయిందని మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే వైద్యుని సలహా మేరకు మందులను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, సరైన ఆహారం తీసుకుంటూ కచ్చితంగా ప్రతిరోజు ఒక గంట వ్యాయామం చేయాలని దాని ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చని అన్నారు ముఖ్యంగా మహిళలు ఇంటి పని చేయడం ద్వారా వ్యాయామం అవసరం లేదని అనుకోవడం జరుగుతుందని కానీ ఈ పని వల్ల మన శరీరానికి సరైన వ్యాయామం అందదని రోజులో ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒక గంట నడవడం, యోగా చేయడం, వ్యాయామం వంటివి చేయడం అవసరమని అన్నారు. ఈ ఉచిత శిబిరం నందు మైక్రో లాబ్స్ డిటిఎఫ్ 3 నుండి మణికంఠ, అమర్ నాథ్ సుమారు వందమందికి ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి అలై కొత్త మెహర్ శ్రీరాములు, అలై వనుం ఉపేంద్రనాథ్, మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు అలై ఎంవివి గణేష్, అలై సిహెచ్ గణేష్, అలై కట్టా జగన్మోహన్ కిషోర్, కె పట్టాభిరామారావు, నాగమణి, శ్యామల, శ్రీనివాస్, రేణుక తదితరులు పాల్గొన్నారు.