గోల్డెన్ రేటింగ్ కోసం కృషి : సీఎం చంద్రబాబు
శ్రీసిటీ: సీఎం చంద్రబాబు నాయుడు శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో, పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తారని, పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ఆ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందని చెప్పారు. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, పెట్టుబడులు రాబట్టేందుకు ఎన్నో దేశాల్లో పర్యటించానని తెలిపారు.ఆయన హైటెక్ సిటీ ప్రాజెక్టును పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) విధానంలో చేపట్టినట్లు చెప్పారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా ఐటీ నిపుణులు కనిపిస్తారని, అందులోనూ ఏపీకి చెందిన వారు కూడా ప్రముఖంగా ఉంటారని పేర్కొన్నారు.శ్రీసిటీలో ఏర్పాటైన పారిశ్రామిక జోన్‌ల గురించి మాట్లాడుతూ, 8 వేల ఎకరాల్లో ఏర్పాటైన ఈ పారిశ్రామిక ప్రాంతంలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉందని, 30 కంపెనీల ప్రతినిధులతో సమావేశమైందన్నారు.శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయడానికి గోల్డెన్ రేటింగ్ కోసం కృషి చేస్తున్నామని, శ్రీసిటీని పచ్చదనం, వర్ష నీటి సంరక్షణ, మరియు మంచి మౌలిక సదుపాయాల కల్పనతో అత్యుత్తమ నివాసయోగ్య ప్రాంతంగా అభివృద్ధి చేయాలని తెలిపారు.అమరావతి రాజధాని నిర్మాణం, 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇంటింటికీ నీరు, విద్యుత్, ఫైబర్ నెట్ అందించడంలో ప్రగతిని వివరించారు. 2047 నాటికి భారత్ ఒకటి లేదా రెండు స్థానాల్లో నిలుస్తుందని, ఈ లక్ష్యంతో విజన్ 2047 ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు.