టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద ఆయన హల్ చల్ చేశారు. కాపులు అంతా ప్రజా శాంతి పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానం పలికారు. ముద్రగడ పద్మనాభం ఆలోచించి.. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలుకుతున్నట్టు తెలిపారు. ఏపీలో పాలన మారాలంటే.. పాల్ రావాలని అని కేఏ పాల్ కామెంట్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ ఆశావహులు తనను కలవాలని, తమ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సీనియర్ లీడర్ బాబు మోహన్ తన పార్టీలోకి వచ్చాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరింత మంది కీలక నాయకులు తమ పార్టీలోకి రావాలని పేర్కొన్నారు. పాల్ రావాలి.. పాలన మారాలి అని ఆయన అన్నారు.
ఇదే సందర్బంలో ఎన్నికల సంఘంపైనా కామెంట్ చేశారు. ఎలక్షన్ నిర్వహించడం కోసం ముగ్గురు కమిషనర్స్ ఉండాలని, కానీ, ప్రస్తుతం ఒక్కరే ఉన్నారని కేఏ పాల్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించకూడదని అన్నారు. తాను హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ పిల్ వేశానని వివరించారు.