టీ20 వరల్డ్ కప్‌ను వాటేసుకుని రాహుల్ కన్నీరుకార్చాడన్న అశ్విన్
తన కెరీర్‌లో ఒక్క వరల్డ్ కప్ కూడా గెలుచుకోని రాహుల్ ద్రావిడ్ తాజా టీ20 ప్రపంచకప్ విజయంతో అతిపెద్ద లోటును పూడ్చుకున్నాడు. కప్ గెలిచిన సందర్భంగా రాహుల్ ద్రావిడ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడని క్రికెటర్ ఆర్. అశ్విన్ తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చాడు. ‘‘2007 నాటి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఓటమితో తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటికి టీమ్‌కు రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తరువాత అతడు మరెన్నడూ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టలేదు. ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా అతడు జట్టు వెన్నంటే ఉన్నాడు. కానీ ఏదైనా పొరపాటు జరిగినా, టీమిండియా విఫలమైనా వెంటనే రాహుల్ ఏం చేస్తున్నాడని అడిగేవారు. గత రెండు మూడేళ్లుగా రాహుల్ ఏం చేస్తున్నాడో నాకు తెలుసు’’‘జట్టుకు సంబంధించి ఒక సమతుల విధానాన్ని రాహుల్ అనుసరించాడు. తన విధానాన్ని మార్చుకునేందుకు చాలా కష్టపడ్డాడు. ఒక్కో ప్లేయర్ కోసం ఎంతో చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా టీమ్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక కోహ్లీ.. ద్రావిడ్‌ను పిలిచి కప్ అందజేసిన క్షణంలో అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కప్‌ను గట్టిగా వాటేసుకున్నాడు. ఆనందంతో అరిచాడు. కన్నీటిపర్యంతమయ్యాడు. అతడి భావోద్వేగం నా మనసుకు తాకింది’’ అని అశ్విన్ చెప్పాడు.