కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి కి సీఎం ఆదేశం
నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం
ఇమామ్ లకు, మౌజన్ లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం
మైనారిటీలకు లబ్ది జరిగేలా వక్ఫ్ భూముల అభివృద్ది
మైనారిటీ సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
అమరావతి:- ముస్లిం మైనారిటీ వర్గాలకు అందే పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీల నేపథ్యంలో….ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయాలని..వీటి కోసం పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలని సీఎం ఆదేశించారు. మైనారిటీ సంక్షేమం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేశారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్ల కు సంబంధించి పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలుగు దేశం ప్రభుత్వంలో మంజూరై కొంత మేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. ప్రారంభంకాని పనులను రద్దు చేసి పునః సమీక్ష చేయాలని సూచించారు. కడపలో హజ్ హౌస్ కోసం నాడు తెలుగుదేశం ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేసి 80 శాతం మేర నిర్మాణం పూర్తి అయిందని అధికారులు తెలిపారు. ఈ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చెయ్యాలని సీఎం సూచించారు. మైనారిటీ విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శిక్షణా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే గుంటూరు క్రిస్టియన్ భవన్ కు నాడు తెలుగుదేశం ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేయగా 50 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించగా…మిగిలి ఉన్న పనులను పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మైనారిటీలకు ఇచ్చే ఆర్థిక సహకార పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలని సూచించారు. వక్ఫ్ బోర్డ్ భూముల అభివృద్ధి పరిచేందుకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం అంగీకారం తెలిపారు. వక్ఫ్ బోర్డు భూములను అభివృద్ది చేయాలని…అందులో ఆ వర్గానికి చెందిన వారే భాగస్వాములుగా ఉండేలా చూడాలన్నారు. వక్ఫ్ బోర్డు కు ఆదాయం తీసుకురావడంతో పాటు….భూముల అభివృద్ది ఫలాలు ఆ వర్గానికే అందేలా చూడాలని సూచించారు. అదే విధంగా నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. మత కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖలు అనవసర జోక్యం చేసుకోవద్దని….వారి గౌరవాలకు భంగం కలగకుండా ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం సూచించారు. ఇమామ్ లకు, మౌజన్ లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు, రూ.5 వేలు ఇస్తామన్న హామీని త్వరలో అమల్లోకి తేవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అర్హత ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖాజీలు గా నియమించాలని సీఎం తెలిపారు. మసీదుల నిర్వహణకు రూ. 5 వేలు ఆర్థిక సాయం., హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. 1 లక్ష సాయం ఇచ్చే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించారు. మైనారిటీలకు స్మశాన వాటికల స్థలం కేటాయింపు కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ ఎండి ఫరూక్, అధికారులు పాల్గొన్నారు.