ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానం సంతానం కలగని దంపతులకు ఎంతో ఉపయోగకరమైనదని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దంపతులను తల్లిదండ్రులుగా మార్చింది. అయితే, ఐవీఎఫ్ పద్ధతిలో పుట్టిన పిల్లల ఆరోగ్యంపై స్వీడన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. గోథెన్ బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఉల్లా బ్రిట్ వెనర్ హాల్మ్ నేతృత్వంలో జరిపిన ఈ పరిశోధనలో, ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సాధారణంగా పుట్టిన పిల్లల కంటే 36 శాతం ఎక్కువగా ఉంటుందని తేలింది.ఇది ముఖ్యంగా కవలలుగా పుట్టిన పిల్లల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. పరిశోధనలో 1980లలో ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే దేశాల్లో పుట్టిన 77 లక్షల మంది పిల్లల ఆరోగ్య డేటాను విశ్లేషించారు. గుండె పనితీరులో లోపాలు ఎక్కువగా ఉండడాన్ని గుర్తించిన ఈ అధ్యయనం, ఐవీఎఫ్ పద్ధతిలో పుట్టిన పిల్లలకు చిన్నతనంలోనే ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సూచిస్తోంది.ఇంకా, ఈ సమస్య తల్లి వయసు, గర్భధారణ సమయంలో పొగతాగే అలవాటు, మధుమేహం, తల్లికి గుండె సంబంధిత జబ్బులున్నా లేదా వంటి అంశాలపై ఆధారపడుతుందని పేర్కొన్నారు.