ప్రత్యేక సాంకేతికతతో గోడల్లోని పగుళ్లను నింపుతామన్న మహారాష్ట్ర సీఎం
ముంబైలో సముద్రం అడుగున నిర్మించిన సొరంగమార్గం కోస్టల్ రోడ్ టన్నల్ లో నీరు లీకవడం సంచలనంగా మారింది. మూడు నెలల క్రితమే దీన్ని ప్రారంభించారు. ఇంతలోనే గోడల నుంచి నీళ్లు లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లీక్‌కు కారణమేంటో తెలియరాలేదు. అధికారులు ప్రస్తుతం దీని వెనకున్న కారణాలు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించారు. నీరు లీకవుతున్న ప్రాంతాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే సందర్శించారు. ‘‘నేను వెంటనే కమిషనర్ కు ఫోన్ చేశాను. రెండు మూడు చోట్ల నీరు లీకవుతోంది. ఈ విషయమై అధికారులు నిపుణులతో మాట్లాడారు. సొరంగాలకు వచ్చిన ముప్పేమీ లేదని వారు భరోసా ఇచ్చారు’’ అని సీఎం పేర్కొన్నారు. ప్రత్యేక సాంకేతికత ద్వారా సొరంగం గోడల్లోని ఖాళీలను నింపేస్తామని సీఎం చెప్పారు. వానాకాలంలో కూడా నీరు లీకయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇది సమస్యకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.