రష్యా సైన్యంలో సహాయకులుగా కొంతమంది భారతీయులు పనిచేస్తున్న విషయం నిజమేనని భారత విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. అయితే, అందులో ఎవరూ కూడా తమకు ఎలాంటి అభ్యర్థనలు చేయలేదని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి దూరంగా ఉండాలంటూ భారతీయులకు పిలుపునిచ్చింది. ఇప్పటికే అక్కడి సైన్యంలో పనిచేస్తున్న పలువురు భారతీయులను వాపస్ తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. త్వరలోనే మిగతా వారినీ రష్యా సైన్యం నుంచి బయటకు తీసుకొస్తామని పేర్కొంది. ఈ విషయంపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం అవుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోమవారం క్లారిటీ ఇచ్చారు.ఏజెంట్ల మోసానికి బలై సైన్యంలో చేరామని, తమను కాపాడాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశామని సోషల్ మీడియాలో భారత యువకులు కొందరు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘రష్యా సైన్యంతో కలిసి పనిచేస్తున్న భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నారంటూ కొన్ని కచ్చితత్వంలేని కథనాలు వస్తున్నాయి. మాస్కోలోని భారత ఎంబసీ దృష్టికి వచ్చే అలాంటి ప్రతి కేసు గురించి మేం మాస్కోలోని అధికారులతో చర్చిస్తున్నాం. భారత్‌లో మా మంత్రిత్వ శాఖ దృష్టికి వస్తున్న కేసులను కూడా దిల్లీలోని ఆ దేశ ఎంబసీ వద్దకు తీసుకెళ్తున్నాం. రష్యా సైన్యం నుంచి భారతీయులందరినీ వీలైనంత త్వరగా విడుదల చేయించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని రణధీర్ జైస్వాల్ తెలిపారు.