ఎడమకాలి మడమ గాయంతో జట్టుకు దూరం
వరల్డ్ కప్ లో సంచలన బౌలింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం గాయంతో సతమతమవుతున్నాడు. భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ ఎడమకాలి మడమ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత దృష్ట్యా ఈ 33 ఏళ్ల పేసర్ ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. షమీ గాయానికి బ్రిటన్ లో శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. వాస్తవానికి షమీ జనవరి చివరి వారంలో లండన్ లో చికిత్స పొందాడు. ప్రత్యేకమైన ఇంజెక్షన్లు తీసుకున్న మూడు వారాల తర్వాత తేలికపాటి వ్యాయామాలు చేయొచ్చని బ్రిటన్ వైద్యులు తెలిపారు. అయితే, ఆ ఇంజెక్షన్లు పనిచేయకపోవడంతో షమీ గాయం ఏమాత్రం నయం కాలేదు. త్వరలోనే శస్త్రచికిత్స కోసం షమీ బ్రిటన్ వెళతాడని, ఐపీఎల్ తాజా సీజన్ లో ఆడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఐపీఎల్ మార్చిలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.