బీసీసీఐ పునరాలోచించాలి దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌పై శార్ధూల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు!
భారత బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తాజాగా రంజీలో శతకంతో సత్తా చాటాడు. తమిళనాడుతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో శార్దూల్ కేవలం 89 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తంగా 105 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండడం విశేషం. అది కూడా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనదైన శైలిలో ఆడి ఆదుకున్నాడు. ఇక ఫామ్ లేమితో ఇటీవల టీమిండియాలో చోటు కోల్పోయిన ఈ ఆల్‌రౌండర్ ఈ ధనాధన్ శతకంతో మరోసారి బీసీసీఐ తలుపుతట్టాడనే చెప్పాలి. ఇదిలాఉంటే.. దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌పై శార్దూల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల వ్యవధితో 10 మ్యాచులు ఆడడం ఏ ఆటగాడికైనా ఇబ్బందిగానే ఉంటుందన్నారు. ఇలా విరామం లేకుండా క్రికెట్ ఆడితే శరీరం సహకరించడం కష్టమని పేర్కొన్నాడు. అలాగే ఆటగాళ్లు వరుసపెట్టి రోజుల వ్యవధిలో క్రికెట్ ఆడితే గాయాల బారిన పడతారని అన్నాడు. వచ్చే ఏడాది నుంచి ఈ విషయంలో బీసీసీఐ ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఏడెనిమిదేళ్ల క్రితం ఇలా షెడ్యూల్ ఉండేది కాదని, మొదటి మూడు మ్యాచులకు మూడు రోజుల గ్యాప్ ఉంటే.. ఆ తర్వాత నాలుగో మ్యాచ్‌కు నాలుగు రోజుల వ్యవధి ఉండేదన్నాడు. ఇక నాకౌట్ మ్యాచులకైతే ఐదేసి రోజుల వ్యవధి ఉండేదని చెప్పుకొచ్చాడు.