దొరకునా ఇటువంటి సేవ..
నీ పద రాజీవముల చేరు
నిర్వాణ సోపాన మధిరోహణము
సేయు త్రోవ..!
శంకరశాస్త్రి..
కచేరీ చేస్తూ వేదికపైనే
తుది శ్వాస విడిచిన
సంగీత స్రష్ట…
కళాతపస్వి అద్భుత సృష్టి..
ఆ పాత్ర..
శంకరశాస్త్రి ఆవాహనై…
నటన అవగాహనై…
ఒక ఆవేశమై..
పరకాయప్రవేశమై..
నిజంగా ఉన్నాడేమో
ఆ సంగీత కళానిధి..
అతడే సోమయాజులేమో..
శంకరాభరణం
ఆయన కథేనేమో…
తన వ్యథేనేమో
అన్నట్టుగా జీవించి
సినిమాలో వలెనే
నటిస్తూ మరణించిన..
మరణించినా శంకరశాస్త్రిగా
ఎప్పటికీ జీవించి ఉండే
జొన్నలగడ్డ వెంకట
సుబ్రమణ్య సోమయాజులు
శాశ్వత చిరునామా..కళ..
వెండితెరకు శంకరాభరణం
ఎనలేని కళ..!
అక్కినేనిని కాదని..
గుమ్మడిని వద్దని..
కృష్ణంరాజు తగడని..
తనకు తగిన మేస్త్రి
అతడేనని సోమయాజులు
రూపమైన శంకరశాస్త్రి..
పంచె..పొడుగుకోటు..
తలపాగా..గుర్రం బగ్గీ..
ఒక నిండైన విగ్రహం..
జమీందారునైనా లెక్కేసేయని..
గుర్రపు డెక్కల లయతో
కూడిన పండితుని ఆగ్రహం..
రక్తం అంటిన చేతులతో
అర్ధరాత్రి ఇంటి
గుమ్మం తట్టిన
తులసిని చూసి
వెరవని నిగ్రహం..
ఆమెకు అండగా నిలబడి
ఊరంతా విస్తుబోయేలా
ఇంటికి తీసుకెళ్లిన సంస్కరణం..
ఏం నీకు చాత కాదా..
అని ప్రశ్నించి
ఆచార వ్యవహారాలమర్మాలు
బోధపర్చిన సంస్కారం..
స్వరసంకరం చేస్తే బిడ్డనైనా
మన్నించని కందిగడ్డ..
తాను నమ్మిన
సత్సాంప్రదాయ సంగీతానికి పూర్వ వైభవం వచ్చేపాటికి
పులకించిపోయి
ఆ పారవశ్యంలోనే
చివరి రాగం..తుది శ్వాస
విడిచిన అభినయం..
సోమయాజులుకు
బ్రహ్మరథం పట్టిన
ప్రేక్షకలోకం..
దాసోహమన్న
సినిమా ప్రపంచం..!!
ఆస్కారుకు ఆస్కామున్నా…
ప్రజాదరణ పురస్కారం..
అద్భుతాన్ని ఆవిష్కరించిన
సోమయాజులుకు
అతి పెద్ద నమస్కారం🙏🙏
సప్తపది..వంశవృక్షం..
ఓ లెక్క..
త్యాగయ్య మరో చుక్క..
ఎన్ని సినిమాలు చేసినా
శంకరాభరణం శంకరశాస్త్రి
ఎప్పటికీ ప్రకాశిస్తుండే వేగుచుక్క..
తమ్ముడు రమణమూర్తి గిరీశమై..
తాను లుబ్దావధానులై
కన్యాశుల్కం ప్రదర్శన..
సోమయాజులు
కళాతపస్సుకు నిదర్శన..!