శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20లో ఘటన
రెఫరీకి ఫిర్యాదు చేస్తామన్న శ్రీలంక ఆటగాళ్లు
డీఆర్ఎస్ మరోమారు వివాదాస్పదమైంది. ఫలితం తమకు అనుకూలంగా రాకపోవడంతో శ్రీలంక క్రికెటర్లు ఆగ్రహంతో ఊగిపోయారు. అంపైర్‌పైకి దూసుకెళ్లి గొడవకు దిగారు. అంపైర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు. దీంతో ఆట చాలాసేపు ఆగిపోయింది. శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య నిన్న జరిగిన రెండో టీ20లో ఈ ఘటన జరిగింది. తాజా ఘటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.శ్రీలంక పేసర్ బినుర ఫెర్నాండో బౌలింగులో బంగ్లాదేశ్ బ్యాటర్ సౌమ్య సర్కార్ వికెట్ల వెనక దొరికిపోయాడు. బంతి బ్యాట్‌ను తాకిందని భావించిన అంపైర్ వెంటనే గాల్లోకి వేలు లేపాడు. అయితే, సౌమ్య మాత్రం అది నాటౌట్ అని భావించి డీఆర్ఎస్‌కు వెళ్లాడు. థర్డ్ అంపైర్ అన్ని కోణాల్లోంచి చాలాసేపు పరిశీలించి చివరికి బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే, బంతి చాలా స్వల్పంగా బ్యాట్‌ను రాసుకుంటూ వెళ్లినట్టు కనిపించడంతో అది అవుటేనని భావించిన శ్రీలంక ఆటగాళ్లు అంపైర్‌తో గొడవకు దిగారు. దీంతో మైదానంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి శ్రీలంక ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగారు. ఈ వివాదం చాలాసేపు కొనసాగడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని రెఫరీ దృష్టికి తీసుకెళ్లాలని జట్టు అసిస్టెంట్ కోచ్ నవీద్ నవాజ్ ఆటగాళ్లకు సూచించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 166 పరుగుల టార్గెట్‌ను బంగ్లాదేశ్ సునాయాసంగా ఛేదించింది.