సన్ రైజర్స్ హైదరాబాద్ తమ అత్యధిక ధర ప్లేయర్ అయిన ప్యాట్ కమిన్స్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇన్నాళ్లూ కెప్టెన్ గా ఉన్న ఏడెన్ మార్క్రమ్ ను తప్పించి కమిన్స్ ను కెప్టెన్ గా చేసింది. గతేడాది ఆస్ట్రేలియాకు ఆరోసారి వరల్డ్ కప్ సాధించి పెట్టిన కమిన్స్ ను గత వేలంలో సన్ రైజర్స్ ఏకంగా రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ గత రెండు సీజన్లుగా దారుణమైన్ ప్రదర్శన చేస్తోంది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ దూరమైన తర్వాత ఏడెన్ మార్క్రమ్ కు కెప్టెన్సీ ఇచ్చినా పలితం లేకపోయింది. గతేడాది 14 మ్యాచ్ లలో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల టేబుల్లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో గత వేలంలో ఏకంగా రూ.20.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సొంతం చేసుకుంది.అప్పుడే ఇక అతనికి కెప్టెన్సీ కట్టబెట్టడం లాంఛనమే అనుకున్నారు. మొత్తానికి సోమవారం ఆ ఫ్రాంఛైజీ అధికారికంగా అనౌన్స్ చేసింది. “ఆరెంజ్ ఆర్మీ.. మన కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఐపీఎల్ 2024లో ప్యాట్ కమిన్స్ తన కెప్టెన్సీని ఏడెన్ మార్క్రమ్ నుంచి తీసుకోనున్నాడు.నిజానికి మార్క్రమ్ ఎస్ఏ20లో కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. అక్కడ కూడా సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్ గా ఉన్న మార్క్రమ్ వరుసగా రెండు టైటిల్స్ ను ఆ టీమ్ కు అందించాడు. కానీ అదే సక్సెస్ ను ఐపీఎల్లో కొనసాగించలేకపోయాడు. కొత్త కెప్టెన్ కోసం చూసిన సన్ రైజర్స్.. వేలంతోనే ఆ విషయాన్ని స్పష్టం చేసింది. 20.5 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో రూ.24.75 కోట్లతో మిచెల్ స్టార్క్ ఉన్న విషయం తెలిసిందే. అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.