Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుటీమిండియా విక్టరీ పరేడ్‌లో అపశ్రుతి!

టీమిండియా విక్టరీ పరేడ్‌లో అపశ్రుతి!

మెరైన్ డ్రైవ్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులు
రద్దీ కారణంగా పలువురికి గాయాలు, స్పృహ తప్పి సొమ్మసిల్లిన వైనం

టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ముంబైలో చేపట్టిన విక్టరీ పరేడ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. మెరైన్ డ్రైవ్ ‌కు అభిమానులు పోటెత్తడంతో రద్దీ కారణంగా పలువురికి గాయాలయ్యాయి. కొందరు ఊపిరాడక స్పృహతప్పిపోయారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖెడే స్టేడియం వరకూ నిన్న టీమిండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరేడ్‌లో పాల్గొనాలంటూ అభిమానులను రోహిత్ శర్మతో పాటు బీసీసీఐ కూడా ఆహ్వానించింది. దీంతో, సంబరాల్లో పాల్గొనేందుకు అభిమానులు పోటెత్తారు. తీర ప్రాంత రహదారిపై నిలిపి ఉంచిన కార్లపైకి ఎక్కి చిందులు వేశారు. దీంతో, అనేక కార్ల టాపులు సొట్టలు పడ్డాయి. రద్దీతో ఉక్కపోత కారణంగా సొమ్మసిల్లిపోయిన ఓ మహిళను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. మరో వ్యక్తి కూడా రద్దీ కారణంగా కాలు జారి కిందపడి సొమ్మసిల్లిపోయాడు. పరేడ్ నిర్వహణలో పోలీసుల తీరుపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవైపు రద్దీ విపరీతంగా ఉంటే పోలీసులు రద్దీ నియంత్రణలో విఫలయ్యారని అన్నారు. వారు అప్రమత్తంగా లేరని కొందరు పెదవి విరిచారు. రాత్రి 8 గంటల సమయంలో రద్దీని నియంత్రించేందుకు ఒక్కరూ కనబడలేదని అన్నారు.
మరోవైపు, విజయోత్సవ సంబరాల కారణంగా దక్షిణ ముంబైలో భారీ ట్రాఫిక్ జామ్‌లు దర్శనమిచ్చాయి. మెరైన్ డ్రైవ్‌పై వాహన రాకపోకలను ఆపేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో రద్దీ ఊహించనంతగా పెరిగిపోయింది. వాంఖెడే స్టేడియం కూడా అభిమానులతో కిక్కిరిసిపోయింది. జూన్ 29న జరిగిన ఫైనల్స్‌లో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్ కొట్టేసిన టీంగా భారత్‌ రికార్డు సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article