బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖపట్నం పోలీసులు అమానుషంగా దాడి చేశారంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టినవాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో సీఎస్ నేతృత్వంలో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సజ్జల, జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారంటూ దేవినేని దుయ్యబట్టారు. అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహారశైలిని ఈసీ కట్టడి చేయాలన్నారు. మీడియాపై పెట్టిన కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు.పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు కూడా పారదర్శకంగా జరగాలని తెలిపారు. హింసపై తమ కాల్‌డేటా బయటపెట్టేందుకు సిద్ధమన్నారు. వైసీపీ నేతలు కాల్‌డేటా బహిర్గతం చేయగలరా? అని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల తప్పిదాలకు కిందిస్థాయి ఉద్యోగులు బలయ్యారని దేవినేని ఉమా ధ్వజమెత్తారు.