హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసి మంత్రులు, ఎంఐఎం, సిపిఐ సభ్యులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఐదో రోజు కూడా సాగు నీటి ప్రాజెక్టులపై యుద్ధం కొనసాగింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ జరగాల్సి ఉంది. మరోవైపు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నేపథ్యంలో కాంగ్రెస్ పక్షం సభలో చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు బయల్దేరారు.మంగళవారం అసెంబ్లీలో కాసేపు మాట్లాడిన అనంతరం.. మంత్రి శ్రీధర్ బాబు సభ్యులందరినీ ప్రాజెక్టు సందర్శనకు ఆహ్వానించారు. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బస్సుల్లో ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించనున్నారు. కాగా, మేడిగడ్డ టూర్ కు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఎంఐఎంకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం వెంట బృందంలో ఉన్నారు.
సీఎం బృందం పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ పోలీసులు, అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, అధిక సంఖ్యలో సీఐలు, ఎస్సైలు సుమారు 800 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు 3 వేల మంది కూర్చోవడానికి వీలుగా సభా స్థలి ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు. అనంతరం, సాయంత్రం మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడతారు. అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి తిరుగు పయనమై రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.