అమరావతి:-లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన వేధింపుల కేసును కొట్టేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే… ఆదిమూలం తనను బెదిరించి అత్యాచారం చేశారంటూ తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన ఓ మహిళ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆదిమూలం ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా ఆదిమూలం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ… మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్ పై మహిళ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇది హనీట్రాప్ అని చెప్పారు. కేసును కొట్టేయాలని కోరారు. మరోవైపు బాధిత మహిళ కూడా కోర్టుకు హాజరై… ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని అఫిడవిట్ దాఖలు చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కేసును కొట్టివేస్తూ ఈరోజు తీర్పును వెలువరించింది.