-ఏపీని లూటీ చేసి అప్పులు మన నెత్తిన పెట్టిపోయారు
-రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు గారు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు
-కుప్పం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తాం
-అడవిబూదుగూరులో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి
కుప్పం:
గత ప్రభుత్వ విధ్వంస పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పులు మన నెత్తిన వేసి వెళ్లారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటనలో భాగంగా అడవిబూదుగూరులో పర్యటించారు. మహిళలతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ. చంద్రబాబు గారు ఎప్పుడూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అనే ఆలోచిస్తుంటారు. పేదరికం లేని సమాజం రావాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. చంద్రబాబు గారు తన పాలనా సామర్థ్యం, విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారు నాకు నమ్మకం ఉంది…గడిచిన ఐదేళ్లలో రాక్షస పాలనలో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పల్నాడులో చంద్రయ్యను అన్యాయంగా చంపేశారు. కార్యకర్తల త్యాగాలు వెలగట్టలేనివి. కష్టకాలంలోనూ చంద్రబాబు గారిపైన నమ్మకం పెట్టుకుని ఆయన చెయ్యి వదలకుండా పనిచేశారు. కార్యకర్తలను ఆదుకుంటాము. వారి బాధ్యత మాదే. కుప్పం ప్రజలు చంద్రబాబు గారిని 8 సార్లు గెలిపించారు. కుప్పం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక్క కుప్పం మాత్రమే కాదు…ప్రతి జిల్లాను హబ్ గా తయారుచేస్తారు. మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యం:డ్వాక్రా ఏర్పాటుతో మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యారు. బ్యాంకు లావాదేవీలు స్వయంగా చేయగలుగుతున్నారు. మహిళల ఆర్థిక ప్రగతికి చేయూత అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కుప్పం మండలంలో ఎలీప్ ఏర్పాటు కాబోతోంది. దీని ద్వారా మహిళలు ఉద్యోగాలు చేయడమే కాదు..ఉపాధి పొంది మరో పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకుంటారు. గత ఐదేళ్లలో కుప్పం నుంచి ఎంతోమంది ఉద్యోగాల కోసం, బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఇక ఆ పరిస్థితి ఉండదని హామీ ఇస్తున్నాను. ఇప్పటికే మేము మహిళల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించి టైలరింగ్ పలు వాటిలో శిక్షణ ఇస్తున్నాము. అంతకుముందు అడవిబూదుగూరులోని జడ్పీ స్కూల్ విద్యార్థులతో భువనేశ్వరి ముచ్చటించారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటారు.