Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఅమెరికాలోనూ ‘చెత్త' నగరాలు.

అమెరికాలోనూ ‘చెత్త’ నగరాలు.

అందరూ ఊహించుకుంటున్నట్లుగా అమెరికా అంటే ఆకాశహర్మ్యాలు, పరిశుభ్రమైన రోడ్లు, సుందరమైన బీచ్ లే కాదండోయ్.. అగ్రరాజ్యం అంటే చెత్తా చెదారం, కాలుష్యం, బొద్దింకలు, ఎలుకలు కూడానట! తాజా అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. లాన్ స్టార్టర్ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం టెక్సాస్ రాష్ర్టంలోని హ్యూస్టన్ నగరం అమెరికాలోకెల్లా అత్యంత చెత్తనగరంగా నిలిచింది! ఈ నగరంలో గాలి నాణ్యత దారుణంగా ఉందని సంస్థ పేర్కొంది. ఎప్పుడు కూలుతాయో అన్నట్లుగా కనిపించే భవనాలు, ఎటుచూసినా బొద్దింకలు నగరమంతా కనిపిస్తుంటాయని వివరించింది. అలాగే శాన్ ఆంటోనియో, టాంపా నగరాల్లోనూ బొద్దింకల సమస్య తీవ్రంగా ఉందని నివేదిక తెలిపింది. ఈ మూడు నగరాలను బొద్దింకల రాజధానులుగా చెప్పొచ్చని సర్వే ఎద్దేవా చేసింది.ఇక బోస్టన్, ఫిలడెల్ఫియా, బాల్టిమోర్ నగరాల్లో ఎలుకలు దండయాత్ర చేస్తుంటాయట. ఎలుకలు అంటే భయపడే వారు ఈ నగరాలకు వెళ్లకపోవడమే మంచిదని అధ్యయనం సూచించింది.అలాగే అందరూ ఊహించినట్లుగా న్యూయార్క్ నగరం కూడా అంత అందమైన నగరం ఏమీ కాదట. పరిశుభ్రత విషయంలో ఈ నగరం 12వ స్థానానికే పరిమితమని సర్వే సంస్థ పేర్కొంది. ఈ రాష్ర్టంలోని శాన్ బెర్నార్డినో నగరాన్ని నాలుగో చెత్త నగరంగా ఎంపిక చేసింది. దీన్ని క్యాలిఫోర్నియా రాష్ర్ట ‘చంక’గా అభివర్ణించింది. ఆ నగరంలో గాలి నాణ్యత దారుణంగా ఉంటుందని లాన్ స్టార్టర్ తెలిపింది. అలాగే రివర్ సైడ్, ఒంటారియో నగరాల్లో భరించలేని దుర్గంధం వ్యాపిస్తుంటుందని వివరించింది.ఇక స్వచ్ఛమైన మంచినీరు లభించే నగరాలను వేళ్లపై లెక్కపెట్టొచ్చని సర్వే సంస్థ తెలిపింది. చెత్త నగరాల జాబితాలో మొత్తంగా 19వ స్థానంలో నిలిచిన లాస్ వేగాస్ లో రక్షిత తాగునీరు ఎండమావేనట. ఇక్కడి నీరు తాగేందుకు సురక్షితం కాదని సర్వే పేర్కొంది.మరోవైపు ఒహాయో రాష్ర్టంలోని ఐదు నగరాల్లో సిగరెట్ ప్రియులు ఎక్కువట. అందుకే అక్కడ రోడ్లన్నీ సిగరెట్ పీకలతో నిండిపోతుంటాయట. ఫ్రీమాంట్, క్యాలిఫోర్నియా, విన్ స్టన్–సేలం, నార్త్ కరోలినాలోనూ పరిశుభ్రత గాల్లో దీపం చందమేనని లాన్ స్టార్టర్ తెలిపింది.గాలి నాణ్యత, మౌలికవసతులు, చెద సమస్యలు, స్థానికుల సంతృప్తి తదితర అంశాల ఆధారంగా లాన్ స్టార్టర్ సంస్థ అమెరికాలోని నగరాలకు ర్యాంకులు కేటాయించింది. స్వచ్ఛత విషయంలో వర్జీనియా బీచ్ తొలి స్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article