ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ గురించి చెబుతూ ప్రత్యేక వీడియో విడుదల చేసిన ఆయన పలు విషయాలను పంచుకున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తూ ఎత్తుగడలు వేశారని పేర్కొన్నారు. తాను పవన్‌కు వీరాభిమానినని కానీ, ఆయన సినిమాలకు మాటలు రాసే అదృష్టం రాలేదన్నారు. పవన్ అప్పుడప్పుడు సడెన్‌గా చిన్న నవ్వు నవ్వుతుంటారని, దానికి నిర్వచనం రాయాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
రాజకీయాల్లో పోరాడి వేల ఓట్ల తేడాతో గెలవడం మామూలు విషయం కాదన్న పరుచూరి.. తన పార్టీ తరపున పోటీ చేసిన అందరినీ గెలిపించుకుని చరిత్ర సృష్టించారని తెలిపారు. ఇన్ని రోజులు తాను మాట్లాడినవి సినిమా డైలాగులు కావని నిరూపించారని ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రిగా హుందాగా, ఓపిగ్గా పవన్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రాజకీయ జీవితం దెబ్బతింటుందని, అందుకనే ఆయన జాగ్రత్తగా పనిచేస్తున్నారని తెలిపారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకరు రాముడైతే.. మరొకరు లక్ష్మణుడని, ఒకరు కృష్ణుడైతే.. మరొకరు అర్జునుడని పరుచూరి అభివర్ణించారు. పవన్ ప్రమాణస్వీకారాన్ని తాను కళ్లార్పకుండా చూశానని, ఆయన వారాహి మాల వేసుకుని కనిపించినప్పుడు ముచ్చటేసిందన్నారు. రాజకీయాల్లో పవన్ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.అప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటించారని, పవన్ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. పవన్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌లు, ఫైటింగ్‌లు అవసరం లేదని, చిన్న డైలాగ్ చాలన్నారు. పవన్ రాష్ట్రానికి ఎంత మేలు చేస్తారో, నిర్మాతలు, టెక్నీషియన్ల కష్టాలు విని సినీ రంగానికి కూడా అంతే మేలు చేయాలని ఆశిస్తున్నట్టు పరుచూరి ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.