మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం పచ్చుకున్నారు. వీరద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. శనివారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్, చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మైలవరానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నదే తన లక్ష్యమన్నారు. వైసీపీలో ఎన్నో అవమానాలకు గురయ్యానని, ఎలాంటి గౌరవం దక్కలేదన్నారన్నారు.
రాష్ట్రం ప్రగతి మార్గంలో ముందుకు వెళ్లాలంటే పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు రావాలన్నారు. ఇవన్నీ చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ముందుకు తీసుకెళ్లే సత్తా చంద్రబాబుకే ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో గత నాలుగేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నిర్మాణం, అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయినా తనకు వైసీపీలో ప్రాధాన్యత లభించలేదన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానన్నారు. మైలవరం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం జగన్ ఎన్నో వినతులు ఇచ్చానని, కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు.వైసీపీ అన్ని సర్వేల్లోనూ మైలవరంలో తానే గెలుస్తానని వచ్చిందన్నారు. సీఎం జగన్ టికెట్ ఇస్తానన్నా వద్దని వచ్చేశానన్నారు. చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తానని, లేదంటే పార్టీ కోసం పనిచేస్తానన్నారు.
టీడీపీలో చేరిన వేమిరెడ్డి
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. శనివారం నెల్లూరులోని పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో వేమిరెడ్డి…టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… నెల్లూరు లోక్ సభ నుంచి పోటీ చేస్తున్నానని, అందరూ ఆశీర్వరించాలన్నారు.ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో వచ్చాయన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ… వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజా సేవకు మారుపేరు అన్నారు. వైసీపీతో యుద్ధానికి సై అంటూ అందరూ ముందుకొస్తున్నారన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరులో టీడీపీ విజయం ఖరారైందన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నానన్నారు. ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు.