Friday, November 29, 2024

Creating liberating content

క్రీడలుఆలస్యంగా జట్టుతో కలిసేందుకు అనుమతి కోరిన కోహ్లీ… ఓకే అన్న బీసీసీఐ!

ఆలస్యంగా జట్టుతో కలిసేందుకు అనుమతి కోరిన కోహ్లీ… ఓకే అన్న బీసీసీఐ!

ఐపీఎల్-2024 టోర్నమెంట్ ముగిసినప్పటికీ క్రికెట్ అభిమానులను అలరించేందకు మరో టీ20 క్రికెట్ సంరంభం నాలుగు రోజుల్లోనే షురూ కాబోతోంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు కొంతమంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా బృందం ఇప్పటికే అమెరికా చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్‌ రాహుల్ ద్రావిడ్‌తో పాటు పలువురు కీలక ఆటగాళ్లు గత శుక్రవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి అమెరికాలో అడుగుపెట్టారు. మరికొందరు ఆటగాళ్లు జట్టుతో కలవాల్సి ఉంది.ఇక టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన విరామ సమయాన్ని మరింత పొడిగించాలంటూ బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఆలస్యంగా జట్టుతో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. కోహ్లీ జట్టులో ఆలస్యంగా చేరతాడని, ఈ మేరకు తమకు ముందుగానే తెలియజేశాడని పేర్కొన్నారు. విజ్ఞప్తి మేరకు బీసీసీఐ కూడా అతడి వీసా అపాయింట్‌మెంట్‌ తేదీ వెనక్కి జరిపిందని వివరించారు. మే 30న తెల్లవారుజామున కోహ్లీ న్యూయార్క్‌ బయలుదేరనున్నాడని, అభ్యర్థన మేరకు బీసీసీఐ అంగీకరించిందని సదరు అధికారి చెప్పినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
విరాట్ కోహ్లీ మే 30న అమెరికా బయలుదేరి వెళ్లనుండడంతో అతడు ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడడం సందేహాత్మకంగా మారింది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు మాత్రమే కోహ్లీ జట్టుతో కలుస్తాడు. ప్రయాణ అలసట కారణంగా అతడు ఈ మ్యాచ్‌ ఆడేది సందేహమేనని తెలుస్తోంది.కాగా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కానుంది. డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా అమెరికా, కెనడా మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. అదే రోజున భారత్ తన ఏకైక వార్మప్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో రోహిత్ శర్మ సేన తొలి మ్యాచ్‌ ఆడనుంది. జూన్ 9న అసలు సిసలైన క్రికెట్ మజాను అందించే హై-వోల్టేజ్ మ్యాచ్‌ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో టీమిండియా తలపడనుంది.వరల్డ్ కప్ గ్రూప్-ఏలో భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌, సహ ఆతిథ్య దేశంగా ఉన్న అమెరికా, కెనడా, ఐర్లాండ్‌ ఉన్నాయి. ఇక భారత్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. చోటు దక్కించుకున్న మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ కూడా జట్టుతో పాటు ఉండనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article