ఎక్కడుంది ప్రజా స్వామ్యం..
ఇదేనా ప్రజల పట్ల చిత్తశుద్ది..
అధికారం ఉంటేనా సభలు..
అధికారం పోతే సభలు అక్కర్లేదా..
ప్రజలే అంతిమంగా ఆవివేకులా..
ఇదేనా సంప్రదాయం ఇందుకేనా ప్రజలున్నది..
వీరేనా మన ప్రజాప్రతినిధులు ..
వీరితోనేనా ప్రజల జీవితాలు బాగుపడేది..
వీరు ప్రజా రక్షకులా…లేక ప్రజా శిక్షకులా..
ఎక్కడుంది ఈ రాజ్యాంగ విధానం..
చట్ట సభలురాని సభ్యులెందుకు..
చట్ట సభలను దారి మళ్లించిందెవరు..
మళ్ళీ చట్టాలు చేసేదెవరు..
చట్టమా…నీవెవరికి చుట్టమో..
ఇదేమి రాజకీయ రాక్షస క్రీడ..
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ఏది ప్రజాస్వామ్యం ఎక్కుడుంది ప్రజాస్వామ్యం… ఎవరన్నారు ప్రజాస్వామ్యం లో ఉన్నామని…ఈ రాజకీయ పార్టీల తీరు చూస్తే ప్రజాస్వామ్యం పక్కున నవ్వుతోంది.ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పార్లమెంటరి విధానాలు, న్యాయ వ్యవస్థ, రాజకీయ,అధికార వ్యవస్థలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఒకనాటి ఆంగ్లేయుల పాలనను గుర్తుతెచ్చుకుంటారని స్వాతంత్రము రకమునుపే చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పిన విధంగా ఈనాటి ప్రజలు ఆ వైపు ఆలోచన చేయాల్సి వచ్చే దిశగా నేటి రాజకీయ పార్టీల నాయకులు అడుగులు వేయడం జరుగుతుందనేది మేధావుల భావన.ఇందుకు ఏ రాజకీయ పార్టీని కించపరిచేలా కానీ మరొక పార్టీని భుజాలు కెత్తుకుని మోయడం కాదు.నేటి సమాజంలో జరుగుతున్న రాజకీయ పార్టీల విధానాన్ని చూసి ప్రజలు చెందుతున్న ఆవేదన చూసి అందిస్తున్న కథనం…ఏమిటీ ఆ విధానాలు ఎందుకు ఈ దిగజారిన విధానం అని ఒక సారి ఆలోచన చేస్తే అందరికి అర్థమవుతుంది.ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల నాటకీయ పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ .ముక్కున వేలేసుకుంటుంది…రాజకీయాలు అనేది మానవ సమాజంలోని అన్ని వర్గాలకు ముఖ్యమైన అంశం, ఇది అధికార పంపిణీ, విధానాల రూపకల్పన, అమలు, సంఘం, ప్రాంతం లేదా దేశం యొక్క పాలన చుట్టూ తిరుగుతుంది. సమాజాలు పనిచేసే విధానాన్ని, వ్యక్తులు వారి ప్రభుత్వాలతో ఎలా పరస్పరం వ్యవహరించాలో రూపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రాజకీయాలు ఎన్నికలు, దౌత్యం, చట్టాన్ని రూపొందించడం, ప్రజా వ్యవహారాల నిర్వహణ వంటి అనేక రకాల కార్యకలాపాలను కలిగి ఉంటాయి.ఎన్నికలనేవి ప్రజాస్వామ్య రాజకీయాలలో ఒక ప్రాథమిక భాగం. పౌరులు తమ ప్రతినిధులను, నాయకులను ఎన్నుకునే వీలు కల్పిస్తుంది. ఎన్నికల ఫలితాలు దేశము లేదా ఆయా రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.అధికారమనేది ప్రధాన అంశంలో అధికార పంపిణీ,వాటి అమలుకు సంబంధించినవి. అధికారంలో ఉన్నవారు, ఎన్నికైన అధికారులు లేదా ఇతర నాయకులు, ఆర్థిక వ్యవస్థ, చట్టాలు, ప్రజా విధానంతో సహా సమాజంలోని వివిధ అంశాలను ప్రభావితం చేయగల, నియంత్రించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.రాజకీయాలు ప్రభుత్వ ఆలోచనతో సన్నిహితంగా ముడిపడి ఉన్నాయి, ఇది ఒక సమాజం అధికారాన్ని వినియోగించే, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ లేదా సంస్థ. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాలు, రాచరికాలు, అధికార పాలనలు, మరిన్నింటితో సహా వివిధ రూపాలను తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే రాజకీయాలు విభిన్నంగా ఉంటున్నాయి.దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం అధికార మార్పిడి ప్రతి ఐదు సంవత్సరాలు ఒక సారి జరుగుతూ వస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మార్చి 29 1982 నాడు అన్న ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించి రాజకీయాలలో కొట్టవరవడి ని సృష్టించారు.నాటి ఇందిరమ్మ పాలనను ప్రజల్లో ఎండగట్టి రాజకీయాలకు కొత్త అర్దాన్ని తెచ్చారు.ఆనాటి నుండి ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మారుతూ వచ్చిన నవ్యాంధ్రప్రదేశ్ లో నేడు జరుగుతున్న రాక్షస క్రీడ లేదన్నది నిజమని చెప్పాలి. ప్రజల కోసం ప్రజాసంక్షేమము కోసం అనేక పోరాటాలు నిరసనలు చేశారు. కానీ చట్ట సభల్లో విమర్శలు చేసుకున్న అవి సహేతుకంగా ఉండేవే తప్ప ప్రజా చీత్కారాలు మూట కట్టుకునేవి కాదని విజ్ఞుల అభిప్రాయం. కానీ రాష్ట్ర విభజన తరువాత చట్ట సభలంటే గౌరవ మర్యాదలు పూర్తిగా మంట కలిసి పోయే విదంగా తయారు అయ్యాయని చెప్పక తప్పడం లేదు.ఇందులో ప్రజల కోసం పోరాడుతున్నారా లేక ప్రజా సమస్యల ముసుగులో తమ ఉనికిని కాపాడుకొని మళ్ళీ అధికారం కోసం ఆరాటపడుతున్నార నేది స్పష్టంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష్య అన్నట్లు 2014 లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలు బహిష్కరించి పాదయాత్ర చేసి ప్రజా తీర్పుతో అధికారం చేపట్టారు.చేపట్టిన తొలినాళ్ళ నుంచి ప్రతిపక్ష పార్టీ పై దుమ్మెత్తిపోశారు. కేసులు ఇలా ఒకటి కాదు సభలో కూడా ఆనాడు వారు వ్యవహరించిన న దానికి భిన్నంగా వ్యవహారిస్తే అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభను బహిష్కరించి ప్రజల్లోకి వెళ్లారు.కూటమి ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ పార్టీకి ప్రతి పక్ష హోదాకు సరిపడా బలం లేకుండా తీర్పును పొందారు. మళ్లీ కేసులు మొదలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన పార్టీ సభకు హాజరు కావడం లేదు.ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంకు శ్రీకారం చుడితే మంచిదే కానీ ప్రజలు ఎన్నుకున్న విధానం ఇక్కడ అమలు జరగడం లేదన్నదే కదా ప్రజాస్వామ్య వాదుల ఆవేదన. చట్ట సభల్లో కి రాకుండా చట్టసభల పట్ల ఇలాంటి తీరు ఉంటే సమాజానికి ఈ రాజకీయ నాయకులు ఏమి మేలు చేస్తారని ప్రజలు విశ్వసించాలో అర్థం కానీ పరిస్థితి దాపురించింది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇలాంటి పరిస్థితి నుంచి రాజకీయ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో మరి వేచి చూడాల్సిందే.