డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు, ఇతర డీప్ ఫేక్ డిజిటల్ కంటెంట్ ఓ బెడదలా పరిణమించాయి. వీటి బాధితుల్లో సెలబ్రిటీలే ఎక్కువ మంది ఉన్నారు. అయితే, ఇవి నకిలీ వీడియోలా, ఒరిజనల్ వీడియోలా అని గుర్తించేందుకు వాట్సాప్ కీలకమైన హెల్ప్ లైన్ ను తీసుకువస్తోంది. అందుకోసం వాట్సాప్ మాతృసంస్థ మెటా… మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (ఎంసీఏ)తో చేయికలిపింది. ప్రత్యేకించి ఫ్యాక్ట్ చెక్ కోసమే పనిచేసేలా ఈ హెల్ప్ లైన్ కు రూపకల్పన చేస్తున్నారు. ఓ వీడియో ఒరిజనలా, డీప్ ఫేక్ వీడియోనా అనేది ఈ హెల్ప్ లైన్ తో నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ హెల్ప్ లైన్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను దుర్వినియోగం చేస్తూ రూపొందించే డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేయడమే తమ ప్రధాన ఉద్దేశం అని మెటా ఓ ప్రకటనలో వెల్లడించింది.