ఎందుకింత దిగజారుడు తనం
ఇదేనా మీ కర్తవ్యం..ఇదేనా మీ ధర్మం..
ఐపీఎస్ ల పరువునే బజారుకీడుస్తున్నారే ..
దేశ చరిత్ర లో ఏపీ ఐపీఎస్ లదే అగ్రస్థానమేమో అవినీతి లో..
మూడు సింహాలను మసక బారిస్తుంటే..
ఇక ప్రజల్లో పరిహాసం పెరగదా ..
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కు పెను ప్రమాదం కాదా..
ఇక ఎందుకు కొట్టాలి మీకు సలామ్ ..
మీరే సత్ప్రవర్తనతో లేకపోతే సమాజాన్ని ఏమి చేస్తారు..
ఓ సమాజమా సిగ్గు పడవే..
చీదరించరా ఈ చీత్కారాలు చూసి..
ఇక మీకు శాంతి లేదు…ప్రజలకు విశ్రాంతి ఉండదు..
రాజులు రాజ్యాలే పోయాయ్ ఇక మనమెంత..
ఈ అపవాదు మీకు కాదు ఆరుకోట్ల ఆంధ్రులది..
ఈ వ్యవస్థ మారేదెన్నడు.. ?
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి.ప్రజాస్వామ్యం పరిహాసమాడుకోవాలి.ప్రజలు కూడా పరిణితి తో ఆలోచన చేయాలి. ఏ వ్యవస్థ ను చూసి వణుకుపుడుతుందో అదే వ్యవస్థ వణికి పోతుంది.ఎవరు ప్రజలకు రక్షణ గా ఉంటారని విశ్వసిస్తారో వారే నేడు ఆత్మ రక్షణ లో పడ్డారు. అవినీతి చేస్తే అమ్మో ఊచలు లెక్క పెట్టాల్సిందే నని భయపెట్టె వారే అవినీతి లో కూరుకు పోయి కొందరు ఊచలు లెక్కిస్తుంటే మరికొందరు ఆ మార్గానికి అతి దగ్గర లో ఉన్నారు.దేశంలో అత్యున్నత స్థాయిలో రాణించి ఐపీఎస్ సాదించి ఆదర్శవంతమైన పాలన లో అగ్రతాంబులం అందుకోవాల్సిన అధికార వ్యవస్థ అవినీతి కంపుని పులుముకుని అట్టడగు స్థాయికి దిగజారి పోతుంటే అప్రజాస్వామిక వాదులు ఆనందం లో మునిగి తేలియాడుతున్నారు. మనిషి పుట్టుకతో పాటు అవినీతి పుట్టినా అలనాటి రోజుల్లో అక్కడక్కడ మాత్రమే ఉండేది. అదికూడా వ్రేళ్ళమీద లెక్క బెట్టుకునే విదంగా ఉండేది.కానీ నేడు చరిత్ర పుటల్లో ఎక్కే విదంగా భరత జాతిని బట్టబైలు చేస్తున్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజలకు సేవ చేసేందుకు ప్రజల రక్తాన్ని చెమట గా మార్చి పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఉప్పు పప్పు రూపంలో చెల్లిస్తే ఆ రూపాయిని తమ వేతనాలు గా తీసుకుంటూ కూడా ఇంకా ప్రజా దోపిడీ కి పాల్పడం అంటే భరత మాత గుండెలపై నాట్యమాడి నట్లు కాదా అన్న ప్రశ్న ఉత్పన్నం మవుతోంది. భారత రాజ్యాంగ ప్రకారం విధులు నిర్వహిస్తూ నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కానీ ఏ ఒక్కరికి ప్రమాదం తలపెట్టనని ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏ ప్రమాణం ప్రకారం నడుచు కోవాలో అలా నడవక తప్పుడు మార్గం లో నడుస్తుంటే చేసిన ప్రమానానికి కట్టుబడి ఎక్కడ ఉందని చెప్పాలి. తమ విధుల్లో ఏ వ్యక్తికి గాని ఏ వ్యవస్థకు గాని ఏక పక్షంగా వ్యవహరించనంటూనే స్వామి భక్తి తో కూడిన పనులు చేసి నేడు సస్పెండ్ కావడం ఎంత సిగ్గుచేటన్నది ఆలోచన చేయ లేని అచేతన స్థితిలో ఈ ఐపీఎస్ లు ఉన్నారంటే వీరితో ప్రజాస్వామ్యం రక్షింప బడుతుందా అన్నది ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు శాస్వితం ఆ ప్రభుత్వాన్ని నడిపే యంత్రాంగం శాస్వితం కానీ ప్రభుత్వ పెద్దలు ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ప్రజాతీర్పుని బట్టి మారుతుంటారు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని పాలన చేసినా ఆ పాలనలో ప్రజలకు అండగా ఉండేది ప్రజా సేవకులైన ఉద్యోగులే కదా.మరి ఇలాంటప్పుడు ఒకరికి కొమ్ము కాయడం ఇంకొకరికి వమ్ము చేయడం అనేది ఎంత వరకు సమంజసమొ అన్నది ఆలోచన చేయాలి. ఆయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది కొన్ని సంఘటనలకు బాద్యులయితే నవ్యాంధ్రప్రదేశ్ లో నేడు చూస్తున్న పరిణామాలు చాలా భిన్నంగా ఉన్నాయి.కారణం రాజకీయాలలో కోసం,తమ ఉనికిని చాటుకునేందుకు వ్యక్తి గత స్వార్థం ఈర్ష ద్వేషం తో కూడుకున్న విధానాల వల్ల ఈ వింత ధోరణి కనిపిస్తుందని చెప్పాల్సి వస్తుంది.గత వైసీపీ ప్రభుత్వంలో ఓకే ఒక్క పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేసి చివరికి ఐదు సంవత్సరాల తరువాత అదికూడా ఉద్యోగ విరమణ రోజు తీరిగి విధుల్లోకి చేరడం జరిగింది.కానీ నేడు కాదంబరి జైత్వాని కేసుతో మొదలు నేటి మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ వరకు ఎంత మంది ఐపీఎస్ లు అభాసుపాలు అయ్యారో చూస్తే ఆచర్యపడాల్సిన పరిస్థితి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాక ముందే ఇలా ఉంటే ఇక రాబోవు రోజుల్లో ఇంకెంత మంది సివిల్ సర్వీస్ లు బజారున పడతారో వేచి చూడాలి.