నాగ చైతన్య-సమంత విడాకుల పై కొండా సురేఖ
నాగ చైతన్య-సమంత విడాకుల విషయమై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి వ్యాఖ్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించారు. దాంతో తాజాగా కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడం మాత్రమేనని అన్నారు. కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని స్పష్టం చేశారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శం అని సురేఖ అన్నారు. తన వ్యాఖ్యల వల్ల సమంత కానీ, ఆమె ఫ్యాన్స్ కానీ మనస్తాపానికి గురయినట్లైతే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.మరోవైపు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల తీవ్రంగా స్పందించారు. నా భర్తపై అపనింద వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. ఓ మంత్రి అయి ఉండి ఇంత దారుణంగా మాట్లాడటం, కల్పిత చెడు ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. వారి రాజకీయ యుద్ధానికి లేదా ప్రయోజనాల కోసం మంచి మనుషులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని రాసుకొచ్చారు.మేడమ్ మినిస్టర్, మీరు నిజాలు తెలుసుకోకుండా నా భర్తపై అపనిందలు వేశారని మండిపడ్డారు. తన భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న వ్యక్తులను నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అని పేర్కొన్నారు. రాజకీయ నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత రాహుల్ గాంధీని ఉద్దేశించి అమల ట్వీట్‌లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారూ, మీరు మానవత్వం, మర్యాదలను నమ్మితే దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకోండని సూచించారు. మీ మంత్రి మా కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె చేసిన విషపూరిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. ఇలాంటి వారి నుంచి ఈ దేశపౌరులను రక్షించాలని కోరారు.
సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, సమంత, ప్రకాశ్ రాజ్, అమల, ఎన్‌టీఆర్ తీవ్రంగా ఖండించారు. తాజాగా నాగ చైతన్య, హీరో నాని, అఖిల్, ఖుష్బూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
సమంతతో తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అక్కినేని నాగ చైతన్య తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదమని పేర్కొన్నారు.“జీవితంలో విడాకుల నిర్ణయం అనేది అత్యంత దురదృష్టకరమైన, బాధాకరమైన విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి.ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల పర్సనల్ లైఫ్ నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు” అని నాగచైతన్య ట్వీట్ చేశారు.
“తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని రాజకీయ నాయకులు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. సమాజానికి చెడుగా ప్రతిబింబించే ఇలాంటి వాటిని అందరూ ఖండించాలి” అని నాని ట్వీట్ చేశారు.మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల చేసిన ట్వీట్‌కు ఆమె కుమారుడు, యువ నటుడు అఖిల్ స్పందించారు. “అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు” అని అఖిల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, నటి ఖుష్బూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా సినీ పరిశ్రమ గురించి బాధ్యతరాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి వాటిని సహించబోదని, మొత్తం సినీ పరిశ్రమకు సురేఖ క్షమాపణ చెప్పాలని ఖుష్బూ ట్వీట్ చేశారు.“రెండు నిమిషాల ఫేమ్, ఎల్లో జర్నలిజంలో మునిగిపోయే వారు మాత్రమే ఇలాంటి భాష మాట్లాడతారని అనుకున్నాను. కానీ ఇక్కడ స్త్రీత్వానికి ఘోర అవమానాన్ని చూస్తున్నాను. కొండా సురేఖ గారూ, మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై ఇలాంటి నిరాధారమైన, భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. ఇలాంటి ఆధారంలేని ఆరోపణలు చేస్తే సినీ పరిశ్రమ చూస్తూ కూర్చోదు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలకు మీరు మరొక మహిళకు మహిళగా, మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు, కానీ మేము మీ స్థాయికి దిగజారలేం” అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.