Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్నేడు వరల్డ్ నో టొబాకో డే

నేడు వరల్డ్ నో టొబాకో డే

ధూమపానం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అందరికీ తెలుసు.. అది మానేస్తే ఆరోగ్యం మళ్లీ బాగవుతుందని కూడా తెలుసు. కానీ పొగతాగడం మానేస్తే శరీరం ఎలా స్పందిస్తుందో మీకు తెలుసా? జీవితంలో చివరి సిగరెట్ కాల్చిన కొన్ని నిమిషాల నుంచి కొన్నేళ్ల వరకు అవయవాలు ఎలా స్పందిస్తాయో ఎప్పుడైనా ఊహించారా? హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్స్ లో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్ వెన్షనల్ పల్మనాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ అయిన డాక్టర్ గోపీకృష్ణ ఎడ్లపాటి ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ఏటా మే 31వ తేదీన వరల్డ్ నో టొబాకో డేగా పాటిస్తోంది. అంటే ఇవాళే అన్నమాట. ఈ సందర్భంగా ‘మనీకంట్రోల్’ వెబ్ సైట్ తో డాక్టర్ ఎడ్లపాటి ప్రత్యేకంగా మాట్లాడారు. సిగరెట్లు కాల్చే అలవాటును ఎన్నేళ్ల తర్వాత మానినా అదేమీ ఆలస్యమైన విషయం కాదన్నారు. ఎప్పుడు, ఏ వయసులో ధూమపానం మానేసినా వారి జీవన ప్రమాణాలు పెరగడంతోపాటు ఆయుర్దాయం పెరుగుతుందని చెప్పారు. ధూమపానం మానేసినప్పటి నుంచి శరీరంలో జరిగే మార్పులు, దానివల్ల కలిగే లాభాలను టైం లైన్ ప్రకారం ఆయన వివరించారు.

సిగరెట్ అలవాటు మానేసిన 20 నిమిషాల తర్వాత..
బీపీ, పల్స్ రేట్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి.

4–5 గంటల తర్వాత..
శ్వాసలోంచి సిగరెట్ వాసన క్రమంగా పోతుంది. ఆపై శ్వాస నుంచి ఎలాంటి దుర్వాసన రాదు. మళ్లీ సిగరెట్ కాల్చలేకపోతున్నందున మనసు కాస్త చికాకు, ఆందోళనకు గురవుతుంది. కానీ ఆ ఆలోచనల నుంచి బయటపడవచ్చు.
24 గంటల తర్వాత..
ఏ క్షణమైనా గుండెపోటు వచ్చే ముప్పు క్రమంగా తగ్గుతుంది. రక్తంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ స్థాయి తగ్గిపోతుంది. అదే సమయంలో రక్తంలో ఆక్సిజన్ స్థాయి బాగా మెరుగుపడుతుంది.
7 రోజుల తర్వాత..
శరీరానికి అధిక మోతాదులో విటమిన్ సీ లభిస్తుంది. అలాగే ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి ఎక్కువగా అందుతాయి. ఇవి శరీరం తిరిగి కోలుకోవడంలో సాయం చేస్తాయి. అలాగే రుచి, వాసన శక్తి మెరుగుపడుతుంది.
2 వారాల తర్వాత..
శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం చేసే సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలో రక్త సరఫరా, ఆక్సిజన్ స్థాయి మరింత మెరుగవుతాయి.
ఒక నెల తర్వాత..
నికోటిన్ వల్ల కలిగిన దుష్ప్రభావాలు తగ్గుతాయి. శరీర అవయవాలు కోలుకోవడం పెరుగుతుంది.
3 నెలల తర్వాత..
ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. లంగ్స్ ను సహజంగా శుభ్రపరిచే ‘సీలియా’ తిరిగి ఏర్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన సిగరెట్లలోని టార్ తోపాటు దుమ్ము, శ్లేష్మాన్ని (మ్యూకస్) తొలగిస్తుంది.
6 నెలల తర్వాత..
సిగరెట్ల అలవాటు వల్ల వచ్చే దగ్గు గణనీయంగా తగ్గుతుంది.
ఒక ఏడాది తర్వాత..
గుండెపోటు వచ్చే అవకాశం సగానికి తగ్గిపోతుంది.
పదేళ్ల తర్వాత..
లంగ్ క్యాన్సర్ సహా ఇతర క్యాన్సర్లు సోకే ముప్పు గణనీయంగా తగ్గిపోతుంది. అసాధారణంగా మారిన ఊపిరితిత్తుల కణాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి.
15–20 ఏళ్ల తర్వాత..
పక్షవాతం లేదా గుండెపోటు వచ్చే ముప్పు సిగరెట్ అలవాటు లేని వ్యక్తికి వచ్చే అవకాశం ఉన్నంత స్థాయికి తగ్గుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article