Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుతుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికే చంద్రబాబు పొత్తులు

తుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికే చంద్రబాబు పొత్తులు

మేదరమెట్ల:ఏపీలో జరగబోతున్న సంగ్రామంలో పేదవాడికి అండగా నిలిచేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగన్ ను ఓడించేందుకు కూటమి, జగన్‌ను గెలిపించేందుకు మీరు చేస్తున్న పోరాటంలో అంతిమ విజయం తమదేనన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ఆదివారం నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభలో పొల్గొన్న సీఎం జగన్.. ఎన్నికల కోసం బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పెట్టుకుంటున్న పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలతో పొత్తుగా ఎన్నికలకు వెళ్తుంటే, చంద్రబాబు మాత్రం వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను సింహం అని, సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని బయటకు తీసి, మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిపై ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు వెంట ఉన్నట్లు నటించే పొలిటికల్ స్టార్లు తన వద్ద లేరంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఒంటరిగానే ఎన్నికలు వెళ్తున్న తనకు ఉన్నది కేవలం ప్రజా మద్దతు అని, వారే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ పేర్కొన్నారు. జనసేనతో పాటు చంద్రబాబు జేబులో మరో రాజకీయ పార్టీ ఉందని.. ఏపీలో ఇటీవల ఏర్పాటైన మూడు పార్టీల పొత్తుపై సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలలో సైన్యాధిపతులు తప్పా, సైన్యమే లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలు, ప్రజల చేతిలో చిత్తుగా ఓడిన పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్‌ను ఓడించేందుకు వస్తున్నాయని చెప్పారు.‘5 కోట్ల ప్రజల అండదండలతో ఎన్నికలకు మేం సిద్ధమని వైసీపీ చెబుతుంటే.. అక్కడ అర డజను పార్టీలతో పొత్తులు, ఎత్తులు, జిత్తులతో రాజకీయాలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాలను తాను ఏలానని, స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించినట్లు చంద్రబాబు చెప్పుకునేవారు. కానీ ఏపీలో వైసీపీ చేసిన మంచి, ప్రజా బలం ముందు నేరుగా ఎదుర్కోలేక.. దత్తపుత్రుడుతో కలిసి ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీ నేతల ముందు చంద్రబాబు మోకరిల్లారు. జగన్ మేలు చేయకపోతే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు.వైసీపీ పార్టీ, ప్రభుత్వం విరగకాసిన మామిడి చెట్టులా ఉంటే.. గత పాపాలకు ఫలితం అనుభవిస్తున్న చెట్టులా చంద్రబాబు పార్టీ ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, ప్రజా ప్రతినిధులు ప్రజల గడప తొక్కి మనం చేసిన సంక్షేమాన్ని వివరిస్తుంటే.. చంద్రబాబు పొత్తుల కోసం పార్టీ నేతల గడపలు తొక్కుతున్నారు. విలువలు, విశ్వసనీయ, సిద్ధాంత బలం, పేదలకు మంచి చేశామన్న చరిత్ర మన సొంతం’ అని నాలుగో సిద్ధం సభలో ప్రతిపక్ష పార్టీల పొత్తులపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘లంచాలు, వివక్ష లేని పాలనతోనే మా ఫ్యాన్‌కు కరెంట్ వస్తుంది. చంద్రబాబు సైకిల్‌కు ట్యూబుల్లేవ్, టైర్లు లేవు, అసలు చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టింది. ఆ సైకిల్ తొక్కడానికి చంద్రబాబుకు వేరే పార్టీలు అవసరం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచిగానీ, ఒక్క పథకం కూడా లేదు. పొత్తుల్లో భాగంగా ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే ప్యాకేజీ స్టార్ తన వాళ్లకు సీట్లు అడగడు. తక్కువ సీట్లు ఎందుకు అని అసలు ప్రశ్నించడు. తాను తానే టీ గ్లాస్ కూడా చంద్రబాబుకు ఇచ్చేస్తాడు. కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చునే వ్యక్తి పవన్ కళ్యాణ్. పొత్తుల్లో లేనట్లు డ్రామా చేయమంటే సైతం రక్తి కట్టిస్తారంటూ’ వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు.


చంద్రబాబు మాదిరిగా నాకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేరు. నాకు చంద్రబాబులా ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, టీవీ5 లేదు. అబద్ధాలకు రంగులు వేసే ఎల్లో మీడియా లేదు. మీ బిడ్డకు రకరకాల పొత్తులు లేవు. ఎన్నికలకు మీ బిడ్డ ఒంటరిగానే వెళుతున్నాడు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో… నాకు అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఇవాళ నా ఎదుట ఇసుక వేస్తే రాలనంతగా ఉన్న మీరందరూ కూడా నాకు స్టార్ క్యాంపెయినర్లే. ఎన్నికలు సమీపిస్తుంటే జగన్ పేరు వింటేనే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మీ బిడ్డ ఇంటింటికీ చేసిన అభివృద్ధిని చూసి చంద్రబాబు భయపడుతున్నాడు. మనను నేరుగా ఎదుర్కొనలేక ఢిల్లీ వెళ్లి పొత్తులు పెట్టుకున్నారు. మన ఎమ్మెల్యేలు గడపగడపకు తిరుగుతుంటే, చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపలకు తిరుగుతున్నారు. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేశామన్న నిజాయతీ నుంచి మన ఫ్యానుకు కరెంటు వస్తుంది. మేనిఫెస్టో నాకు ఒక పవిత్ర గ్రంథం. మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఒక బైబిల్ తో సమానం. అన్ని హామీలు నెరవేర్చి ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకున్నాం. మన ఫ్యాన్ కు కరెంటు ప్రజల్లోంచి వస్తుంది. మన ఫ్యాన్ కు కరెంటు ఇంటింటికీ చేసిన మంచి నుంచి వస్తుంది. మనం అందించిన నవరత్నాల్లోంచి మన ఫ్యానుకు కరెంటు వస్తుంది. లంచాలు లేని, వివక్ష లేని పాలన నుంచి మన ఫ్యానుకు కరెంటు వస్తుంది. బాబు పేరు చెబితే ఒక్క మంచి కూడా గుర్తుకు రాదు. అందుకే పొత్తుల్లో భాగంగా ముందు ఒక ప్యాకేజి ఇచ్చి దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నాడు. ఎందుకు ఈ ప్యాకేజీ స్టార్ ను తెచ్చుకున్నాడంటే… ఈ దత్తపుత్రుడు సైకిల్ సీటు కావాలని అడగడు, తన వాళ్లకు సీట్లు కావాలని అడగనే అడగడు. నాకు ఎందుకిన్ని తక్కువ సీట్లు ఇస్తున్నావని ప్రశ్నించడు… కావాలంటే తాను తాగుతున్న టీ గ్లాసును కూడా చంద్రబాబుకే ఇచ్చేస్తాడు. ఈ దత్తపుత్రుడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు… చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. ఎప్పుడు సైకిల్ దిగమంటే అప్పుడు దిగుతాడు. ఎప్పుడు సైకిల్ ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు… విభేదించినట్టు నటించేలా డ్రామా ఆడమంటే రక్తి కట్టించేలా డ్రామా కూడా ఆడతాడు. కలకాలం గుర్తుండిపోవాలంటే ఏం చేయాలని వెనకటికి ఎవరో చంద్రబాబును అడిగారట. అందుకు ఆ బాబు ఏం చెప్పారంటే… అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది… కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే కలకాలం గుర్తుండిపోతుంది అని అన్నారట. 14 ఏళ్లు సీఎంగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటివాడే. అదే చేశాడు. ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా కూడా వచ్చేది సున్నా. ఈ సున్నా ఎన్నిపార్టీలతో కలిసినా దాని విలువ బోడి సున్నా.
చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలంటే… దోచుకోవడానికి, పంచుకోవడానికి. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా… ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడడానికి… చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి ఇంట్లో మీ బిడ్డ ఫొటో ఉండాలి… అందుకే మీ బిడ్డకు అధికారం కావాలి. మంచి చేయడం కోసం మీ బిడ్డ పరితపిస్తున్నాడు. కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు కూడా ఒకటే చెబుతున్నా. ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశంలో మరే ఇతర పార్టీలు కూడా ఇవ్వలేదు. మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వారికి కచ్చితంగా మంచి జరుగుతుంది… వారికి మంచి జరిగేందుకే మీ బిడ్డ ఉన్నాడు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో తీసుకువస్తున్నాం. చేసేదే చెప్పాం… చెప్పామంటే చేస్తాం. మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింకులోనే ఉండాలి. చంద్రబాబుకు ఓటేయడం అంటే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్టే. రంగురంగుల హామీలు ఇచ్చే చంద్రబాబు కావాలా… ప్రతి ఇంటికీ మంచి చేసే మీ బిడ్డ కావాలా… మీరే నిర్ణయించుకోండి” అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article