ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే వరుస సమావేశాలు పెట్టి అభ్యర్థులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు.అయితే, నేడు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు అందాయి. వీరందరితో మాజీ ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడతారు. వైసీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్ సభ ఎంపీలు ప్రస్తుతం ఉన్నారు.కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి నేతలతో నేరుగా వైఎస్ జగన్ భేటీ అవుతున్నారు. తాజా, ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను వారి ద్వారా అడిగి తెలుసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతలతో మాట్లాడనున్నారు.అలాగే, కార్యకర్తలకు అండగా నిలవాలి, దాడుల్లో ఇబ్బంది పడిన కార్యకర్తలకు పార్టీ సపోర్టు ఉంటుందన్న భరోసాను ఈ సమావేశం ద్వారా పంపనున్నట్లు సమాచారం. ఇక, మరి కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై కూడా ప్రధానంగా వైసీపీ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచనలు చేయనున్నారు.