అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిద్ధం సభ వద్ద ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై ఆ పార్టీ శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమంటూ సోమవారం హిందూపురం పట్టణంలో వివిధ వర్గాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇందులో భాగంగా స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుండి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సర్కిల్ వద్ద దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులను చేతపట్టి.. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోమారు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. విచక్షణారహితంగా శ్రీకృష్ణపై దాడి చేస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు బైఠాయించి నినాదాలు చేశారు. వైకాపా హయాంలో పాత్రికేయులపై దాడులు యథేచ్ఛగా జరుగుతున్నా అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోక పోవడం తగదన్నారు. ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామన్నారు. విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రౌడీలుగా వ్యవహరిస్తూ ఆయనపై దుండగులు దాడి చేయడం అత్యంత అమానుషమన్నారు. దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం సరైన రీతిలో స్పందించకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు.