బుట్టాయగూడెం:మండలంలోని రెడ్డి గణపవరంలో నూతనంగా నిర్మాణం జరుపుకున్న ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈనెల 20వ తేదీన ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఆదివారం విగ్రహ ప్రతిష్టతో పూర్తయ్యాయి. గత మూడు రోజులుగా రెడ్డి గణపవరంలో పండుగ వాతావరణం చోటుచేసుకుంది.
రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వేలాదిమంది భక్తులు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగస్తులయ్యారు. బాలా త్రిపుర సుందరి పీఠాధిపతి బ్రహ్మశ్రీ గరిమళ్ల వేంకటరమణ సిద్ధాంతి పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ పూడి పెద్ది సాయి శర్మ బ్రహ్మత్వంలో 12 మంది రుత్విక్ ఉపాసకుల వేదమంత్రాల నడుమ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 గంటల నుండి నిత్య పూజా కార్యక్రమాలు, శాలార్చన, వివిధ హోమములు, లఘు పూర్ణాహుతి, ప్రధానమూర్తి శ్రీకనకదుర్గాదేవి యంత్ర స్థాపన, ధ్వజస్థాపన, ప్రాకార దేవతా స్థాపన, శిఖర స్థాపన, శిఖరానికి మహాకుంభాభిషేకం, అమ్మవారికి ప్రాణ ప్రతిష్ట, తదితర వైదిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులకు ప్రథమ దర్శనం, కన్యకా దర్శనం, సర్వజన దర్శనం చేయించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి పరిసర గ్రామ దేవాలయాల నుండి, విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం నుండి తీసుకొచ్చిన పసుపు, కుంకుమ, అభిషేక జలములతో అమ్మవారికి అర్చన, గణాచారులచే అమ్మవారికి ప్రత్యేక సేవ నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆలయంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన, సంకల్పిత హోమములు, మహా రుద్ర, నరసింహ, హనుమత్, చండీ హోమములు, నాలుగు గంటల నుండి సంపూర్ణ పూర్ణహుతి, అపబృధ స్నానం, హోమరక్ష జరిపించారు. సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణం, అనంతరం దీక్ష విరమణ పండిత సత్కారం జరిపించనున్నట్లు చెప్పారు. రాత్రి 8 గంటల నుండి విద్యుత్ దీపాలంకరణలతో, నృత్య, గీత, మంగళ వాయిద్యాలతో అమ్మవారి గ్రామోత్సవం జరుగునని తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అఖండ అన్న సమారాధన నిర్వహించారు.