అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. బాలరాముడిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. రాముడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తజనసంద్రోహంగా మారింది. రెండోరోజూ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. తీవ్రమైన చలి, పొగమంచు, చలిగాలులనుసైతం లెక్కచేయకుండా రాంపథం, ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు బాలరాముని దర్శనంకోసం వేచిఉన్నారు. వారంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీరామ స్మరణ చేశారు.భక్తులను అదుపుచేసేందుకు పోలీసులకు సవాలుగా మారింది. సుమారు 8వేల మంది పోలీసులను ఆలయం వద్ద అందుబాటులో ఉంచారు. అయినా, భారీగా రాముని దర్శనంకోసం వచ్చిన భక్తులను కట్టడిచేయడంలో పోలీసులు ఇబ్పంది పడ్డారు.
తొలిరోజు 5లక్షల మంది..
శ్రీరాముడి దర్శనానికి సమయాన్ని రెండు భాగాలు విభజించారు. ఉదయం 7గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బాలరాముని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో తొలిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 5లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ లో ఎరియల్ సర్వే నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సూచనలు చేశారు.