జర్నలిస్ట్ హౌసింగ్ స్కీం జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
అనంతపురము
అర్హత ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇళ్ళ స్థలాలను మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు.
ప్రభుత్వం జర్నలిస్టులకు అందజేస్తున్న హౌస్ సైట్స్ కు సంబంధించి బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జర్నలిస్ట్ హౌసింగ్ స్కీం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ గాయత్రి దేవి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 535లో ఉన్న అన్ని నిబంధనలను పాటించి.. అర్హత ఉన్న జర్నలిస్టులకు హౌసింగ్ సైట్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పని చేస్తున్న జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్స్, వెటరన్ పాత్రికేయులకు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరిచిన అర్హతలు, నిబంధనల ప్రకారం దరఖాస్తులు పూర్తి చేసిన వారికి హౌస్ సైట్స్ కేటాయిస్తామన్నారు. 5 సంవత్సరాల అక్రిడేషన్ అనుభవం కల్గిన వారిని కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, (విజయవాడ) గుర్తించి పంపిన ప్రాథమిక జాబితాను పరిశీలించిన అనంతరం తుది జాబితా మేరకు ఇంటి స్థలాలు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కమీషనర్ (విజయవాడ) కార్యాలయం నుంచి ప్రాథమిక వెరిఫికేషన్ చేశాక జిల్లాకు 335 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత జాబితాను ఆయా మండలాల తహసిల్దార్ లకు పంపించి పరిశీలన చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం అర్హత ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం అవసరమైన స్థలాన్ని సేకరించాలని ఆర్డీవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి మీడియా జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ సభ్యులు జి.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం 20 ఏళ్ల తర్వాత వచ్చిందని, అర్హులందరికీ స్థలాలు ఇవ్వాలని కోరారు. అనర్హత కలిగిన సభ్యులకు అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. వరుసగా ఐదేళ్లు అక్రిడిటేషన్ ఉండి ఏదైనా కారణం చేత ఈ ఏడాది అక్రిడిటేషన్ రాకపోతే వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కమిటీ సభ్యులు ఆర్.భోగేశ్వర్ రెడ్డి, పి.శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ రాకముందే ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రిడిటేషన్ ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.
ఈ సమావేశంలో ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, ఆర్డీఓలు జి.వెంకటేష్, రాణి సుస్మిత, గుంతకల్ ఆర్డీవో కార్యాలయం డిఏఓ భూషణం, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ, పీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.