ఐదేళ్లలో పంచాయితీకి ఐదు లక్షలైనా ఖర్చు చేశారా? అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధం వైకాపా నాయకులు సిద్ధమేనా !..తెలుగుదేశం నాయకులు సవాల్
లేపాక్షి: హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ విమర్శించే స్థాయి వైకాపా నాయకులకు లేదని మండల టిడిపి కన్వీనర్ జయప్ప, తదితర నాయకులు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన లేపాక్షి లోని ఆర్ జె హెచ్ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ జయప్ప మాట్లాడుతూ, ఎమ్మెల్యే బాలయ్య ను వైకాపా నాయకులు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైకాపా పాలనలో టిడిపి ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేయలేదని పేర్కొనడం వారి అమాయకత్వానికి నిదర్శనం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు లేపాక్షి మండలంలో ప్రతి పంచాయతీలో కూడా ఎంపీ నిధులతో, బాలయ్య సొంత నిధులతో పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తోందని, ఈ ఐదేళ్లలో ప్రతి పంచాయితీలో అభివృద్ధి పనులకు కనీసం ఐదు లక్షలైనా ఖర్చు చేశారా అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాలయ్య ఎక్కడ ఉన్నా హిందూపురం అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నారన్నారు. లేపాక్షి మండలంలో దాదాపు కోటి రూపాయలు సొంత నిధులతో రహదారులు ఏర్పాటు చేశారన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధికి సొంత నిధులు వెచ్చించారన్నారు. కరోనా కష్టకాలంలో రెండు కోట్ల విలువైన మందులను కరోనా బాధితులకు అందించడం జరిగింది అన్నారు. నిరుపేదల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో హిందూపురంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి నెలకు 7: 50 లక్షల రూపాయలు వెచ్చించారన్నారు. హిందూపురంలో చిన్న పిల్లల ఆసుపత్రి, కొడికొండ నుండి సిరా వరకు జాతీయ రహదారి ఏర్పాటుకు కృషి చేశారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ఒక్క రహదారినైనా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. అదేవిధంగా సిరివరంలో ఆరు లక్షల రూపాయల వ్యయంతో శుద్ధ జల నీటి ప్లాంటును ఇటీవలే బాలయ్య సొంత నిధులతో ఏర్పాటు చేసి, ప్రారంభించారన్నారు. ఇది వైకాపా నాయకుల కళ్ళకు కనిపించలేదా అని ప్రశ్నించారు. పేదలందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని లక్ష్యంతో బాలయ్య 50 లక్షల సొంత నిధులను వెచ్చించి ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ఏర్పాటుచేసి మారుమూల గ్రామాలకు కూడా వైద్య సేవలను అందించారన్నారు .వైకాపా నాయకులకు ఈ ఆరోగ్య రథం కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రాచీన కళలను ప్రోత్సహించే విధంగా ఇటీవల పరంపర సంస్థ ఆధ్వర్యంలో ప్రాచీన నాట్య కళలను ప్రదర్శిస్తే వాటి వల్ల ఏమి అభివృద్ధి జరిగిందని వైకాపా నాయకులు ప్రశ్నించడం వారి అమాయకత్వానికి నిదర్శనమన్నారు. టీ డీ పీ నేతలు సిరి వరం క్రిష్టప్ప,నాగలింగారెడ్డి, మారుతి ప్రసాద్ ,అభి ,ఆనంద్ కుమార్ ,సర్పంచ్ సిద్దు మాట్లాడుతూ, వైకాపా పాలనలో రహదారుల్లో ఏర్పడ్డ గుంతలను కూడా పూడ్చలేదన్నారు .మండలంలో అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. వైకాపా పాలనలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అభివృద్ధి పనులను ఫోటోలతో పాటు చూపిస్తున్నాం ,మీరు ఏదైనా అభివృద్ధి పనులు చేసి ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. వైకాపా చేపట్టిన అభివృద్ధి పనులపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగుదేశం నాయకులు సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి మంజూరు చేసిన నిధులను కూడా వైకాపా ప్రభుత్వం సొంత పనులకు వినియోగించుకోలేదా అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వ హయాంలో ఏ ఏ అభివృద్ధి పనులు జరిగాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు లేనిపోని ఆరోపణలు చేస్తే మీ మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బయన్నపల్లి రవి ,చంద్రశేఖర్ గౌడ్ ,ఈడిగ రమేష్ ,అంగడి అంజి ,ఎన్బికె మూర్తి, బుల్లెట్ రవి , ఆవుల రెడ్డి ,నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.