అమరావతి:ఒక్క అబద్ధం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని సీఎం జగన్ అన్నారు. చేయలేనివి చెప్పకూడదని, మాట ఇస్తే తప్పకూడదని అన్నారు. రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో రుణమాఫీ చెయ్యమని తన శ్రేయోభిలాషులు చాలా మంది చెప్పారని.. కానీ అబద్ధాలు చెప్పడం నాకు చేతకాదన్నారు సీఎం వైఎస్ జగన్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ఆయన ప్రసంగిస్తూ.. రుణమాఫీ చేస్తానని చెప్పి వుంటే అధికారంలోకి వచ్చే వాళ్లమన్నారు. కానీ తాను అలా చెయ్యలేదని.. చివరి చంద్రబాబు కూడా రుణమాఫీ చేయలేదని, అందుకే 2019లో ఓడిపోయారని జగన్ దుయ్యబట్టారు. విశ్వసనీయత అంటే జగన్ అని నమ్మడం వల్లే విజయం వచ్చిందన్నారు. విశ్వసనీయత సంపాదించడం అంత ఈజీ కాదని.. ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరగాలని ముఖ్యమంత్రి కోరారు. ఇదే సభలో మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామని.. మళ్ళీ అధికారంలోకి వచ్చి బడ్జెట్ ప్రవేశపెడతామని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మాకు అనుభవం లేకపోయినా పరిపాలన ఎలా చేయాలో చూపించామన్నారు. ఇంటింటి ఆర్ధిక పరిస్థితిని మార్చి , పేదలకు అండగా నిలిచామని జగన్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాల వల్ల విద్యా, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. సీఎంగా తనకు 14 ఏళ్ల అనుభవం వుందని చంద్రబాబు చెబుతున్నారని.. రాష్ట్రానికి పనికిరాని ఆ అనుభవం ఎందుకని జగన్ సెటైర్లు వేశారు. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్షం కుట్రలు, మోసాన్ని, అబద్ధాలను, పొత్తులను ఆశ్రయించిందన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే, ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. తాను ఇది చేశాను, నాకు ఓటు వేయాలని చంద్రబాబు అడగటం లేదని.. అధ్వాన్నంగా ఆయన పాలన సాగిందన్నారు. చంద్రబాబు కొత్త కొత్త వాగ్థానాలతో గారడీలు చేస్తున్నారని.. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా వుందా అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్‌కు వెన్నుపోటేనని.. అన్ని సామాజిక వర్గాలను ఆయన మోసం చేశారని సీఎం ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకుని కుట్రలు చేయాల్సిన అవసరం ఏంటి అని జగన్ ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని .. ఎన్నికల తర్వాత టీడీపీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుందన్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారని.. చంద్రబాబు మళ్లీ మోసపూరిత వాగ్థానాలు ఇస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. హామీలు అమలు చేయని చంద్రబాబును 2024 ఎన్నికల్లో నమ్మడం కరెక్టేనా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పే పథకాలు అమలు చేస్తే లక్షా 26 వేల కోట్లు అవసరమవుతాయని.. ఈ ఐదేళ్లలో చంద్రబాబు కంటే ఎక్కువ సంపద సృష్టించామన్నారు. సంపద సృష్టించానని చెబుతున్న చంద్రబాబు హయాంలో ప్రతి ఏడాది రెవెన్యూ లోటేనని.. మనసు లేని నాయకుడు, మోసం చేసే నాయకుడు చంద్రబాబు అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
మోసం చేయడం కోసమే రంగురంగుల మేనిఫెస్టో తీసుకురావడం సమంజసమేనా అని జగన్ ప్రశ్నించారు. మా పథకాలకు రూ.70 వేల కోట్లు అయితేనే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని అంటున్నారని.. మరి అప్పుడు రాష్ట్రం ఏమవుతుందని ఆయన ఆయన నిలదీశారు. వాగ్థానాలు అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని.. మనది మనసున్న ప్రభుత్వం, చెప్పిందే చేస్తామన్నారు. మాట మీద నిలబడ్డాం కాబట్టే 151 సీట్లు ప్రజలు కట్టబెట్టారని జగన్ అన్నారు.
నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించినవాడు దోచుకోగలుతాడని జగన్ ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాల్లోని హామీలను చంద్రబాబు తన మేనిఫెస్టోలో పెట్టుకుంటారని , గతంలో 650 హామీలిస్తే కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. గతంలో 650 హామీలిస్తే కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదన్నారు. స్కీంలు అమలు చేయకుండానే చంద్రబాబు అప్పులు చేశారని.. హామీలు అమలు చేయని చంద్రబాబును 2024 ఎన్నికల్లో నమ్మడం కరెక్టేనా అని జగన్ ప్రశ్నించారు.