లేపాక్షి: శిల్ప చిత్ర కళలకు నిలయమైన వీరభద్రాలయంలో సోమవారం ఉదయం శివపార్వతుల వసంతోత్సవం కన్నుల పండువగా కొనసాగింది.
వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ నేతృత్వంలో ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహ శర్మ ,శ్రీనివాస్ కుమార్ ఉదయం 8 గంటలకు దుర్గాదేవి ,వీరభద్ర, పాపనాసేశ్వర స్వాములకు అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆగమికులు సునీల్ శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి ,దేవాదాయ శాఖగుమాస్తా మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆగమికులు సునీల్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ శర్మ, శ్రీనివాస్ కుమారులు నిర్వహించారు. శాస్త్రోక్తంగా వేద పండితులు వేదమంత్రాలను చదువుతుండగా శివపార్వతుల విగ్రహాలకు వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వసంతోత్సవ కార్యక్రమంలో వేద పండితులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. అనంతరం ధ్వజావరోహణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజ స్తంభానికి నూతన జెండాను ఆవిష్కరించారు .ఈ పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.