మట్టిలో మాణిక్యాలను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తోంది
పద్మ అవార్డుల గ్రహీతలకు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పద్మ అవార్డులకు అర్హులను ఎంపిక చేయడంలో కొత్త విధానం కనిపిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తోందని కొనియాడారు. గుర్తింపు దక్కని వ్యక్తులను గుర్తించి పద్మ పురస్కారాలు ఇస్తోందని వివరించారు.
తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ల వంటి వారైతే… చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు అభివర్ణించారు. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం సంతోషం కలిగించిందని అన్నారు. ఇష్టమైన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది ఏదీ ఉండదని… పట్టుదలకు కృషి తోడైతే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నారు. నేను జీవితంలో పెద్దగా అవార్డులు తీసుకోలేదు, సన్మానాలు పొందలేదు. మీకు అవార్డు ఇస్తున్నాం అని కేంద్రం చెప్పింది… మోదీ మీద గౌరవంతో అవార్డు తీసుకుంటున్నా” అని స్పష్టం చేశారు.